పల్నాటి పులిగా, పేదల వైద్యుడి గా, మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్ గా హుందాతనంతో రాణించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేతకి టీడీపీ ఎన్నారై శ్రేణులు ఘన నివాళి అర్పించాయి.
తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం జూమ్ ద్వారా సెప్టెంబర్ 16న ఈస్టర్న్ సమయం రాత్రి గం.8.30కు (అమెరికా, కెనడా) జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు.
టీడీపీ ఎన్నారై విభాగం నేత జయరాం కోమటి నేతృత్వంలో అమెరికా, కెనడాల నుంచి ఎన్నారైలు భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరై ప్రజల మనసెరిగిన మహానేత కోడెలను స్మరించుకున్నారు.
దేవినేని ఉమ మాట్లాడుతూ… కోడెల చేసిన సేవలు, అభివృద్ధి గుంటూరు ప్రజలకే కాదు, ఏపీ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని అన్నారు. బసవతారకం ఆస్పత్రి అభివృద్ధిలోను కోడెల కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.
డాక్టర్ కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పార్టీకి ఆయన ఎంతో సేవ చేశారని ఈ సందర్భంగా జయరాం కోమటి గుర్తు చేశారు. పల్నాడులో రౌడీయిజానికి పాతరవేసి అభివృద్ధికి పునాదులు వేసిన వ్యక్తి కోడెల అని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ప్రజలకు సేవకుడిగా మెలిగారని జయరాం అన్నారు
నార్త్ కరోలినా రాష్టం,షార్లెట్ ఎన్నారై టీడీపీ సభ్యులు చందు గొర్రెపాటి, నాగ పంచుమర్తి, టాగోర్ మల్లినేని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది .