ఏ రాజకీయ నాయకుడికైనా అధికారంలోకి రావడమే అంతిమ లక్ష్యం. అందుకే ప్రజల ఆదరణ పొంది ఎన్నికల్లో గెలిచే పార్టీలోకి చేరికలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్పై ఆగ్రహంతో ఉన్న నేతలు.. క్రమంగా బలోపేతమవుతున్న బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ రెండింటిలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కానీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాత్రం ఎన్నికల సమయానికి ముందు వరకూ వేచి చూసే ధోరణి అవలంబించేందుకే చూస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ను ఏ పార్టీ ఓడిస్తుందో ఓ అంచనాకు వచ్చి ఆయన ఆ పార్టీలో చేరతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు పార్టీలతోనూ..
2014 ఎన్నికల్లో చేవేళ్ల నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచిన విశ్వేశ్వర్‌రెడ్డి.. ఆ తర్వాత గులాబి దళంతో పొసగక బయటకు వచ్చేశారు. హస్తం గూటికి చేరి 2019 ఎన్నికల్లో మరోసారి చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తన వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూనే రాజకీయాల్లో మాత్రం కొనసాగుతున్నారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమవుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ఆ రెండు పార్టీలు ఇప్పటి నుంచే ప్రత్యేక సన్నద్ధతలో మునిగిపోయాయి. ముఖ్యంగా ఈ రేసులో బీజేపీ కాస్త ముందున్నట్లు కనిపిస్తోంది. కానీ ఎన్నికల సమయానికి ఏ పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తుందో చెప్పలేం. అందుకే ప్రస్తుతం విశ్వేశ్వర్‌రెడ్డి అటు కాంగ్రెస్‌తో ఇటు బీజేపీతో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు.
అటూ ఇటూ..
విశ్వేశ్వర్‌రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కొన్నిసార్లు ఆయన కాంగ్రెస్‌కు మద్దతుగా మరికొన్ని సార్లు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని కోరుతూ బహిరంగంగా ప్రజలకు విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఇక ఇటీవల రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎప్పటిలాగే తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయంగా సేఫ్ గేమ్ ఆడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ముందే తొందరపడి ఏదో ఓ పార్టీలో చేరకుండా.. ఎన్నికల నాటికి టీఆర్ఎస్కు దీటుగా ఏ పార్టీ నిలబడుతుందో అందులో చేరేందుకు ఆయన ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. తనకు రాజకీయంగా ప్రధాన శత్రువు అయిన టీఆర్ఎస్ను దెబ్బకొట్టే ఏ పార్టీకైనా ఆయన మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆర్థికంగానూ తనకు బలం ఉంది కాబట్టి ఆయన వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోటీ చేసి ఎంపీగా గెలవడమే ఆయన లక్ష్యమని అందుకు అవసరమైన పార్టీలో చేరతారని తెలుస్తోంది.