తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఓ బచ్చా అని, కేసీఆర్ పెద్ద డ్రామా రాయుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందని ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటే పొరపాటని సురేఖ హెచ్చరించారు. రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవని, కుటుంబ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని గులాబీ బాస్ కు సురేఖ వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పక్షమేనని, టిఆర్ఎస్-బిజెపి కలిసి ఫామ్ హౌస్ డ్రామాలకు తెరతీశాయని సురేఖ ఆరోపించారు. టిఆర్ఎస్ లో నిరంకుశత్వం నడుస్తోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదిపే పరిస్థితి లేదని విమర్శించారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, కేసీఆర్ కు దమ్ముంటే రాహుల్ తరహాలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ వదులుకున్నట్టు టిఆర్ఎస్ అధ్యక్ష పదవిని కేసీఆర్ వదులకోగలరా అని సవాల్ విసిరారు.
కవితకు నాలుగు రోజులు పార్టీ పగ్గాలు కేసీఆర్ ఇవ్వగలరా అని సురేఖ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ ను తిడితే కేసీఆర్ కే నష్టమని కేసీఆర్, కేటీఆర్ ల పాత వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయని అన్నారు. వీరిద్దరూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ పాదయాత్రకు జనాలను తరలిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ యాత్రకు వస్తున్న స్పందన చూసి ఇలా ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ ప్రధాని కావాలనుకుంటే అయ్యేవారిని, కానీ ఏసీ గదులను వదిలిపెట్టి జనాల్లోకి వచ్చి నడుస్తున్నారని అన్నారు.