ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అందరూ అనుకున్నట్లుగానే వాడీవేడిగా సాగుతున్నాయి. జాబ్ క్యాలెండర్ పై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న టీడీపీ సభ్యుల విజ్ఞప్తిని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులు… స్పీకర్ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. దీంతో, టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని తమ్మినేని సీతారాంకు సభా వ్యవహారాల మంత్రి బుగ్గన సిఫారసు చేశారు. దీంతో, శాసన సభ నుంచి ఒకరోజు పాటు టీడీపీ సభ్యులను తమ్మినేని సస్పెండ్ చేశారు.
మరోవైపు, తొలి రోజు సభలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అందరికీ షాక్ ఇచ్చారు. హఠాత్తుగా తన డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయడం సంచలనం రేపింది. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు కోన రఘుపతి అందజేశారు. అయితే, కోన రఘుపతి రాజీనామాను తమ్మినేని వెంటనే ఆమోదించారు. ఈ క్రమంలోనే మరో ఐదు రోజులపాటు జరగనున్న శాసనసభ సమావేశాలకుగాను కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోబోతున్నారు అని తెలుస్తోంది.
రాజీనామా చేయడానికి ముందు ఈ రోజు సభలో కొద్ది సేపు స్పీకర్ గా వ్యవహరించిన కోన రఘుపతి ముభావంగా కనిపించారు. కానీ, అందుకు తన రాజీనామానే కారణమని తర్వాత తెలిసింది. అయితే, ఈ రాజీనామా నిర్ణయంపై కోన రఘుపతితో జగన్ ముందే చర్చించారని తెలుస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఆయనపై వేటు పడిందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మల్లాది విష్ణును ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా నియమించారు జగన్.
ఈ క్రమంలోనే కోన రఘుపతిని తప్పించి ఆ స్థానంలో కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత కేబినెట్ లో దేవదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు పనిచేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన వీరభద్ర స్వామికి పదవి ఇవ్వాలని జగన్ అనుకున్నారట. అదే జరిగితే ఉత్తరాంధ్ర నుంచి ఒకేసారి శాసనసభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పనిచేసినట్లు అవుతుంది.