కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం చూస్తుంటే పార్టీని వదిలేయాలని ఇప్పటికే డిసైడ్ అయినట్లు అనుమానంగా ఉంది. ముందు నిర్ణయం తీసేసుకుని అందుకు తగినట్లుగా వేదికను రెడీచేసుకుంటున్నారు. అందుకనే గొంతెమ్మకోరికలు, షరతులు పెడుతున్నారు. కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొందరలోనే బీజేపీలో చేరబోతున్నారు. చేసిన రాజీనామా ఆమోదంపొందింది కాబట్టి ఉపఎన్నిక తప్పదు.
కాంగ్రెస్ కు రాజీనామాచేసిన రాజగోపాల్ బీజేపీలో చేరి అక్కడి నుండి పోటీ చేయటమూ దాదాపు ఖాయమే. ఇక్కడే వెంకటరెడ్డికి పెద్ద సమస్య వచ్చి పడింది. బీజేపీ తరపున పోటీచేయబోతున్న తమ్ముడికి కాంగ్రెస్ నేతగా తాను వ్యతిరేకంగా పనిచేయాలా ? లేదా తమ్ముడి గెలుపుకు సహకరించాలా ? ఇదే ఇఫుడు వెంకటరెడ్డిని వేధిస్తున్నది. కాంగ్రెస్ లో ఉంటు తమ్ముడి గెలుపుకు ఏరకంగా కూడా సహకరించలేరు. అలాగని తమ్ముడి ఓటమికీ పనిచేయలేరు.
అందుకనే ఉంటే సైలెంటుగా ఉపఎన్నికకు దూరంగా ఉండాలి. లేకపోతే పార్టీ నుండి తాను కూడా బయటకు వెళ్ళిపోవాలి. పార్టీలో సైలెంటుగా ఉండటం సాధ్యంకాదు. ఏదోపద్దతిలో పార్టీనుండి బయటకు వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే గొంతెమ్మకోరికలు కోరుతున్నారు. చండూరు బహిరంగ సభలో మరో సీనియర్ నేత వెంకటరెడ్డిని బూతులు తిట్టారు. తర్వాత ఆయనే ఎంపీకి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఎంపీ మాత్రం సీనియర్ నేతతో తనను బూతులు తిట్టించిన పార్టీ పెద్దలు తనకు క్షమాపణలు చెప్పాలంటు డిమాండ్ చేస్తున్నారు. వెంకటరెడ్డి ఉద్దేశ్యంలో పార్టీ పెద్దలంటే పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డే.
ఎంపీని సీనియర్ నేత తిడితే రేవంత్ ఎందుకు క్షమాపణలు చెప్పాలి ? పైగా తనకు క్షమాపణలు చాలవట సదరు సీనియర్ నేతను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపఎన్నికపై జరుగుతున్న సమావేశాలకు తనను ఎవరు పిలవ లేదంటున్నారు. ఇవన్నీ చెబుతునే మళ్ళీ రేవంత్ పై డైరెక్టుగా ఆరోపణలు చేస్తున్నారు. తనను పార్టీలో నుండి వెళ్ళగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంపీ చెప్పటమే విచిత్రంగా ఉంది. ఒకవైపు తానే పార్టీని వదిలి వెళ్ళిపోయేందుకు రెడీ అవుతు మళ్ళీ పార్టీపైనే ఆరోపణలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.