తనకు తిరుగులేదని.. తను ఎలాంటి అడుగులు వేసినా.. మడుగులు వొత్తేవారు ఉన్నారని.. భావిస్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి .. ఆదిలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన పార్టీ మారుడు ఖరారైంది. త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకురెడీ అయ్యారు.
కాంగ్రెస్ బ్రతిమాలినా.. బామాలినా.. ఆయన ఉండేది లేదని ఖరారైపోయింది. అయితే.. నాయకుడి బలం అంతా కూడా.. కార్యకర్తల్లోనే ఉంటుంది కదా.. ఇప్పుడు ఇదే సమస్య కోమటిరెడ్డికి ఎదురైంది.
ఆయన పార్టీని వీడి వెళ్తున్న క్రమంలో తన వెంట రావాలంటూ.. తనకు అత్యంత సన్నిహితులైన అనుచరులతో చర్చించారు. అయితే.. వారు మాత్రం.. తాము ప్రాణం అయినా.. ఇస్తామని.. కానీ, పార్టీని మాత్రం విడిచి పెట్టేది లేదని.. తెగేసి చెప్పేశారు.
పార్టీ మార్పుతో పాటు.. రాజీనామా అంశంపై కూడా స్థానిక నాయకులతో రాజగోపాల్ రెడ్డి చర్చిస్తున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అయితే.. కార్యకర్తల నుంచి ఆయనకు మిశ్రమ స్పందన వస్తుండటం గమనార్హం.
పార్టీ మార్పు విషయంలో తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కొందరు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలుపుతుండగా.. మెజారిటీ కార్యకర్తలు, అనుచరులు మాత్రం పెదవి విరుస్తున్నారు. “వ్యక్తిగతంగా మీరంటే ప్రాణం ఇస్తాం.. కానీ మీ వెంట రాలేం..” అంటూ కొందరు అభిమానులు రాజగోపాల్‌రెడ్డికి నేరుగానే తేల్చి చెబుతున్నారు.
పార్టీ మార్పు వద్దని.. అందులోనూ బీజేపీలోకి అస్సలు వద్దని సూచిస్తున్నారు. బీజేపీకి నియోజకవర్గంలో సానుకూలత లేదని వివరిస్తున్నారు. ఒకవేళ రాజీనామా చేస్తే.. తిరిగి గెలుపు సాధ్యం కాదని మరికొందరు ముఖం మీదే చెప్పేస్తున్నారని సమాచారం.
మరోవైపు.. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే.. కాషాయ కండువా కప్పుకోవాలని కొమటిరెడ్డి స్పష్టంగా చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న రాజగోపాల్‌రెడ్డి.. రాజీనామాపై మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
పార్టీ మారుతున్నట్టు సంకేతాలు అధిష్ఠానానికి ఇప్పటికే చేరిన నేపథ్యంలో.. హైకమాండ్ సస్పెండ్ చేస్తే వెంటనే బీజేపీలో చేరొచ్చన్న వ్యూహంతో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆయనకు ఆదిలోనే ఇంత పెద్ద దెబ్బ తగులుతుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.