తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తమిళ స్టార్ హీరో విజయ్ భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ వచ్చిన విజయ్ ప్రగతి భవన్ లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ్ను ఆహ్వానించిన కేసీఆర్ ఆయనను ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు, ప్రగతి భవన్‌కు వచ్చిన విజయ్‌కు టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఘన స్వాగతం పలికారు. విజయ్ వెంట దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా వచ్చారు.
తాను చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో విజయ్ పాలుపంచుకున్నారని, అందుకు ఆయనకు ధన్యవాదాలని సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఆ చాలెంజ్ లో విజయ్ పాల్గొన్నారని, విజయ్ తో అమూల్యమైన సమయాన్ని గడిపానని ట్వీట్ చేశారు. అయితే, విజయ్, కేసీఆర్ ల భేటీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదైనా ప్రత్యేక అంశంపై చర్చించేందుకే విజయ్ హఠాత్తుగా ప్రగతి భవన్‌కు వెళ్లారా? అన్న చర్చ జరుగుతోంది.
ఇక, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన తాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు షూటింగ్ కు వచ్చిన విజయ్…మర్యాదపూర్వకంగా కేసీఆర్ ను కలిశారని అంటున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న విజయ్ ను కేసీఆర్ తో భేటీకి సంతోష్ కుమార్ తీసుకువచ్చారని తెలుస్తోంది. ఇక, కొంతకాలంగా విజయ్ రాజకీయ అరంగేట్రంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనూ ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక, బీజేపీపై వార్ కు కేసీఆర్ తెరతీయడం, గతంలో మెర్సల్ సినిమా విషయంలో విజయ్ ను బీజేపీ టార్గెట్ చేయడం వంటి వ్యవహారాల నేపథ్యంలో ఈ బీజేపీ వ్యతిరేకులిద్దరి భేటీ రాజకీయంగానే జరిగి ఉంటుందన్న టాక్ వస్తోంది. అయితే, ఈ భేటీపై విజయ్ స్పందించలేదు.