గత వారం రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. వైసీపీ హయాంలో లడ్డు కోసం వాడిన నెయ్యిలో జంతు కొవ్వుల ఆనవాళ్లు ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. రాజకీయంగా ఇది పెను దుమారానికి దారి తీసింది. ఈ అంశం ఎంతో సున్నితంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో తన సినిమా ఈవెంట్లో ‘లడ్డు ప్రస్తావన వచ్చేసరికి కంగారు పడిపోయాడు తమిళ కథానాయకుడు కార్తి. అతను హీరోగా నటించిన ‘మెయ్యళగన్’ సినిమాను తెలుగులో ‘సత్యం సుందరం’గా అనువదించారు.
ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చాడు కార్తి. ఐతే ఈ ఈవెంట్ మధ్యలో యాంకర్ ‘‘లడ్డు కావాలా నాయనా.. ఇంకో లడ్డు కావాలా నాయనా’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. దీంతో కార్తి ఉలిక్కి పడ్డాడు. ‘‘ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్. మనకొద్దు అది’’ అని నవ్వేశాడు. దీంతో ఆడిటోరియం హోరెత్తింది. యాంకర్ ఆపకుండా.. ‘‘మీ కోసం మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం. సిచువేషన్స్ కావాలి’’ అంది. దానికి కార్తి బదులిస్తూ.. ‘‘లడ్డు వద్దు.. ఇప్పుడొద్దు’’ అని తేల్చి చెప్పాడు.
ఇక ఈ ఈవెంట్లో కార్తి తెలుగు ప్రేక్షకులు తన మీద చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. అంతే కాక ఈ ఈవెంట్లో తనకెంతో ఇష్టమైన తెలుగు పాట గురించి చెబుతూ.. ‘‘అదే నీవు అదే నేను..’’ పాటలో కొన్ని లైన్లను చక్కటి తెలుగులో పాడడం విశేషం. ‘సత్యం సుందరం’ కథ చాలా ప్రత్యేకమైందని.. ఒక్క రోజులో గడిచే కథ ఇదని.. ఈ సినిమా గురించి తెలుసుకుని నీ దగ్గరికి మాత్రమే మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తాయిరా అని సూర్య ఆశ్చర్యపోయాడని.. సినిమా చూసి ఆనందంతో తనను కౌగిలించుకున్నాడని కార్తి చెప్పాడు. ‘96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ‘సత్యం సుందరం’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.