కరోనా టైంలో ఓటీటీ లు ఎలా విజృంభించాయో అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేని పరిస్థితుల్లో నిర్మాతలు ఊహించని రేట్లు ఇచ్చి సినిమాల డిజిటల్ హక్కులను కొన్నాయి. చాలా సినిమాలను నేరుగా స్ట్రీమ్ చేశాయి. ఈ క్రమంలో ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. నిర్మాతలు కూడా ఓటీటీలు ఇచ్చే రేట్లు చూసి సంబరపడ్డారు. స్టార్ హీరోల సినిమాలకు అధిక రేట్లు వస్తుండడంతో అందుకు తగ్గట్ల బడ్జెట్లు, పారితోషకాలు పెంచేశారు.
తీరా చూస్తే ఓటీటీలు ఒకప్పటి రేట్లు ఇవ్వడం మానేశాయి. ధరలు బాగా తగ్గించేశాయి. ఇంతకుముందులా సినిమాలను గుడ్డిగా కొనేయట్లేదు. ఇప్పుడు డిజిటల్ డీల్స్ పూర్తి కాక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. డిజిటల్ హక్కుల ద్వారా అదనపు ఆదాయం చూసి పారితోషకాలు బాగా పెంచేసిన స్టార్ హీరోలు ఇప్పుడు తగ్గనంటున్నారు. మధ్యలో నిర్మాతలు అన్యాయం అయిపోతున్నారు.
ఈ పరిస్థితి గురించి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ వేరే దర్శకులతో కలిసి ఏర్పాటు చేసిన ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో కుండబద్దలు కొట్టారు. ఓటీటీలు ఆడుతున్న జూదం గురించి అతను కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితిని థియేట్రికల్ బాక్సాఫీస్ ఫెయిల్ అనలేం. ఇది ఓటీటీ సంస్థలు సృష్టించిన మాాయాజాలం. కరోనా నాటి పరిస్థితులను అవి తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. వాళ్లు వచ్చి రజినీకాంత్, విజయ్ సినిమాలకు 120 కోట్లు ఇస్తాం.
మీరు సినిమాలు తీయండి అని నిర్మాతలను ప్రోత్సహించారు. దీంతో బడ్జెట్లు పెరిగిపోయాయి. హీరోలకు పారితోషకాలు కూడా పెంచేశారు. కానీ కొన్నాళ్ల తర్వాత తాము ఎక్కువ రేట్లు ఆఫర్ చేశాయని ఓటీటీలు భావించాయి. ఆ రేట్లు కష్టమని వెనక్కి తగ్గాయి. కానీ అప్పటికే హీరోలకు భారీ పారితోషకాలు ఇచ్చేలా అగ్రిమెంట్లు జరిగిపోయాయి. బడ్జెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఓటీటీలు వెనక్కి తగ్గితే ఏం చేయాలి’’ అని వెట్రిమారన్ ప్రశ్నించారు. బడ్జెట్లు అదుపులో ఉంచి మంచి సినిమాలు తీస్తే ఇప్పటికీ థియేటర్లలో మంచి ఫలితం వస్తోందని.. ఇది ఆలోచించాల్సిన విషయమని వెట్రిమారన్ చెప్పారు.