ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీని టార్గెట్ చేసి మోడీ చేయించిన ఈడీ రైడ్లతో వివిధ రాష్ట్రాలలోని పలు పార్టీలు కూడా ఇరకాటంలో పడ్డాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ వేడి ఏపీ రాజకీయాలను కూడా తాకింది. ఈ మద్యం కుంభకోణంలో సీఎం జగన్, ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వారిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్, భారతి, విజయసాయిరెడ్డిలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వారి పాత్ర కూడా ఉందని ప్రపంచం మొత్తం చెబుతోందని రవీంద్ర షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ మద్యం కుంభకోణంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ అనే సంస్థను సీబీఐ ఏ5గా పేర్కొందని, ఆ సంస్థకు అదాన్ డిస్టిలరీస్ ద్వారా రూ. 2 వేల కోట్లు మళ్లించారని కొల్లు రవీంద్ర షాకింగ్ ఆరోపణలు చేశారు.
ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ అనే సంస్థ జగన్, విజయసాయిరెడ్డిల సూట్‌కేస్ కంపెనీ అని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో జగన్ కుటుంబం, విజయసాయిరెడ్డిలకు సంబంధం ఉందని, ఈ విషయం సీబీఐ విచారణలో కూడా బట్టబయలైందని ఆరోపించారు. ఇక, ఈ స్కాంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణిల పేర్లు ఇరికించిన వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతపై కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు.
చంద్రబాబు దయవల్లే రాజకీయాల్లోకి వచ్చారన్న విషయాన్ని సునీత మర్చిపోకూడదని రవీంద్ర హితవు పలికారు. తాడేపల్లి ప్యాలెస్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. హెరిటేజ్ సంస్థలను లాభాల బాట పట్టించిన భువనేశ్వరి, బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు తగవని సునీతకు హితవు పలికారు. అన్నారు. పనికిమాలిన మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి ఆ బురదను టీడీపీపై వేయాలని చూస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.