గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై `కోడి కత్తి` దాడి ఘటన జాతీయవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్….తాను జగన్ అభిమానినని, ప్రజల్లో జగన్ పై సానుభూతి కోసమే ఇలా దాడి చేశానని స్వయంగా వెల్లడించాడు. తాను దాడి చేసిన కారణాలను వివరిస్తూ లేఖ కూడా రాశాడు. కానీ, ఎలాగైనా తమ బండారం బట్టబయలు కాకూడదన్న నెపంతో కొందరు వైసీపీ నేతలు….శ్రీనివాస్…టీడీపీ కార్యకర్తేనంటూ ఓ ఫేక్ ఐడీని సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు.
అయితే, ఆ ఐడీ కార్డు ఫోర్జరీ చేశారని, తన టీడీపీ సభ్యత్వ కార్డును శ్రీనివాసరావుదిగా ఫోర్జరీ చేశారని నంబూరి అంకాలు అనే టీడీపీ కార్యకర్త సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందుకు వచ్చాడు. దీంతో, శ్రీనివాస్ కోడి కత్తి డ్రామా అంతా వైసీపీ నేతల డైరెక్షన్ లోనే నడిచిందని తేట తెల్లమైంది. అయితే, 2018లో జగన్ పై దాడి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీనివాస్ రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నాడు.
ఈ నేపథ్యంలో తాజాగా శ్రీనివాస్ తల్లి సావిత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు సావిత్రి లేఖ రాశారు. తన కుమారుడిని గత నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ను తక్షణమే విడుదల చేయాలని సీజీఐని కోరారు. ఈ కేసు గురించి ప్రస్తుతం కోర్టులో కానీ, ఎన్ఐఏ విచారణ గానీ జరగడం లేదని పేర్కొన్నారు.
కేవలం మూడు నెలలు బెయిల్ ఇచ్చి తిరిగి మళ్లీ తన కొడుకును కస్టడీలోకి తీసుకుని జైలుకు పంపారని అన్నారు. జైల్లో తన కుమారుడు నరకం అనుభవిస్తున్నాడని, అందువల్ల అతడిని వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని సీజేఐని సావిత్రి వేడుకున్నారు. మరి, ఈ వ్యవహారంపై సీజేఐ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.