రాజకీయాల్లో ఉన్నాం కదా.. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నాం కదా.. ఏం చేసినా.. ఏం మాట్లాడినా చెల్లుతుంది.. మా కెవరు అడ్డు చెబుతారు? అని అనుకోవడం నాయకుల్లో పరిపాటిగా మారింది. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకుడు, మంత్రి కొడాలి నాని.. వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. రాజకీయాల్లో మాట్లాడే భాష.. ప్రత్యర్థులను ఆలోచించుకునేలా చేయాలి.. కానీ, నోటికి ఎంత మాటొస్తే.. అంత మాట అనేయడం, కేవలం దుర్భాషలాడడమే రాజకీయం అన్నట్టుగా వ్యవహరిస్తుండడం ఇటీవల కాలంలో మంత్రి కొడాలికి మామూలైపోయిందనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో గడిచిన నాలుగు రోజులుగా భారీ వర్షాలు వరదల కారణంగా అనేక జిల్లాలు వరద నీటిలో మునిగిపోయాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలు ఇప్పటికీ వరద నీటిలో నానుతున్నాయి. అక్కడి ప్రజలు ప్రభుత్వ సాయం అందక అలో లక్ష్మణా! అంటూ వేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ముందుండాల్సిన మంత్రులు కొందరు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రస్థావన తీసుకువచ్చారు. ప్రజలు ఇలా అల్లాడుతుంటే.. చంద్రబాబు ఎక్కడని ప్రశ్నించారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చారు? సీఎం సీటులో ఎవరిని కూర్చోబెట్టారు? మరి ఆయనే కదా.. ప్రజలను కష్టాల్లో ఆదుకోవల్సింది.
ఆయనే కదా.. ప్రజల వద్దకు వచ్చి.. వారిని పరామర్శించి.. ఓదార్చాల్సింది! కానీ, సీఎం జగన్ మాత్రం తన రాజసౌధం వీడి రాలేదు. ఇక, మంత్రులు తనను విమర్శించారని అనుకున్నారో.. లేక ప్రజలను పలకరించాలనే భావనతోనో.. మాజీ సీఎం చంద్రబాబు.. తన కుమారుడు మాజీ మంత్రి లోకేష్‌ను బాధిత ప్రాంతాలకు పంపించారు. ఆయన వరద ముంపునకు గురైన గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు. ఎక్కడా రెచ్చగొట్టే ధోరణి కానీ, పరుష పదజాలం కానీ వాడలేదు. “వరదలు, వర్షాలతో ప్రజలు అల్లాడుతుంటే.. సీఎం జగన్ రివ్యూ పెట్టడంలోనూ తాత్సారం చేశారు. దాదాపు 11 జిల్లాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్నా.. ఆయన నిమ్మకు నీరెత్తినట్టు వున్నారు. ఇప్పటికైనా ప్రజలను ఆదుకునేందుకు ఆయన ప్రజల మధ్యకురావాలి. లేకపోతే.. రాబోయే రోజుల్లో మేమే వచ్చి ప్రజల తరఫున నిలదీస్తాం“ అన్నారు లోకేష్.
దీనిలో వివాదం లేదు. భారీ ఎత్తునప్రభుత్వాధినేతకు బట్టలు ఊడదీసేసింది కూడా లేదు. కానీ, ఈ విషయంపై స్పందించిన మంత్రి కొడాలి నాని.. మాత్రం లోకేష్‌పై విరుచుపడ్డారు. వాడు.. వీడు.. బలిసి కొట్టుకుంటున్నాడు.. అంటూ.. ఫక్తు.. ఓ వీధి నాయకుడిగా విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. మేం అడిగింది చంద్రబాబు రావాలని.. కానీ, వీడు వచ్చాడు.. అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి మంత్రులు కోరాల్సింది ఎవరిని? అయ్యా ముఖ్యమంత్రి గారూ.. పరిస్థితి తీవ్రంగా ఉంది.. మీరు వచ్చి పర్యవేక్షించి ప్రజలకు ధైర్యం చెప్పండి.. అని సీఎంను కోరాలి. కానీ, ఘనత వహించిన మంత్రులు మాత్రం చంద్రబాబుపై పడ్డారు. పైగా ప్రజలను పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి లోకేష్‌పై దూషణల పర్వం కొనసాగించారు. మరి దీనినే కదా.. అధికార మదం అంటారు.. అని సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగిపోయాయి. నోరు అదుపు తప్పితే ఎప్పటికైనా దాని ఫలితం అనుభవించకతప్పుతుందా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి వీటికి ఏం సమాధానం చెబుతారో కొడాలి వారు!!