కొడాలి నాని …వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా, మాజీ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. అయితే, హఠాత్తుగా నాని సంచలన ప్రకటన చేశారు. 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అంటూ నాని చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని నాని ప్రకటించారు. అయితే, ఆ సమయానికి తన సోదరుడి కుమారుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపితే అతడు తన రాజకీయ వారసుడు అవుతాడని నాని అన్నారు.
2029 నాటికి తన వయస్సు 59 అవుతుందని, అప్పటికి రిటైర్మెంట్ వయసు సమీపిస్తుందని చెప్పుకొచ్చారు. ఎవరో కొత్త కుర్రాళ్లకు టికెట్ ఇస్తే వాళ్లకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. తన కూతుళ్లకు రాజకీయాలపై ఆసక్తి లేదని, తన తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి వస్తాడేమో తెలియదని చెప్పారు. గుడివాడలో రోడ్ల కోసం 500 నుంచి 600 కోట్లు ఖర్చవుతాయని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ డబ్బులు జగన్ గారు ఇస్తే చాలని నాని అన్నారు.
ఇక రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏర్పడి తాను గెలిస్తే మంత్రి పదవి అక్కర్లేదని నాని తేల్చి చెప్పేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు గుడివాడ నుంచి పోటీ చేయబోనని నాని సంచలన ప్రకటన చేశారు. అయితే నాని చేసిన ఈ ప్రకటనతో వైసీపీ హై కమాండ్ కు షాకిచ్చింది. ఈ వ్యవహారంపై తాడేపల్లి ప్యాలెస్ లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే, 2024 ఎన్నికలలో ఒకవేళ నానికి జగన్ టికెట్ ఇస్తే ఆయన ప్రత్యర్థి టిడిపి నేత రాము అవుతారు.
అయితే రాము బలమైన ప్రత్యర్థి కావడంతో జనాల్లో సింపతి కోసమే కొడాలి నాని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని టాక్ వస్తోంది. మరోవైపు ఇప్పటివరకు నానికి టికెట్ ఇస్తాను అని జగన్ చెప్పలేదు. ఇవ్వను అని కూడా అనలేదు. గుడివాడలో నానిపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇచ్చేలా, ఆ సీటు గెలుచుకోవడానికి జనాల్లో సింపతీ సంపాదించేలా నాని ఈ ప్రకటన చేశారని పుకార్లు వస్తున్నాయి. ఏది ఏమైనా నాని సంచలన ప్రకటనతో జగన్ మైండ్ బ్లాక్ అయిందట!