సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై వివేకా కూతురు సునీత రెడ్డి కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు కూడా హాజరయ్యారు. కడప ఎంపీ సీటు వివేకాకు ఇవ్వాల్సి వస్తుందని ఆయనను హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఇక, సీఎం జగన్ ఓఎస్డీతో పాటు వైఎస్ భారతి పిఎలను కూడా సిబిఐ అధికారులు విచారణ జరిపిన నేపథ్యంలో ఈ హత్య కేసులో జగన్ పాత్రపైనా పలు అనుమానాలను ప్రతిపక్ష నేతలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా చనిపోతే జగన్ కు ఆస్తి ఏమీ లభించలేదని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, ఆ ఆస్తులన్నీ వివేకా భార్య, కుమార్తె, అల్లుడి పేర్ల మీద బదలాయించాలని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ వివేకా బతికున్నా కూడా కడప ఎంపీ సీటును అవినాష్ రెడ్డికే ఇచ్చేవారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వైసీపీ పెట్టినప్పుడు వైయస్ విజయమ్మపై కాంగ్రెస్ అభ్యర్థిగా వివేకా పోటీ చేసిన సంగతిని నాని గుర్తు చేశారు. విజయమ్మను ఓడించేందుకు వివేకా కుటుంబం ప్రయత్నించిందని ఆరోపించారు. వివేకా చనిపోవడం వల్ల వైసీపీకి లాభం చేకూరిందేమీ లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వివేకా చనిపోవడంతోనే సిబిఐ విచారణ కోరామని అన్నారు.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. వైఎస్ కుటుంబం నాశనం కోరుకునేవారు వివేకా ఫ్యామిలీలో ఉన్నారంటూ కొడాలి నాని చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబం జగన్ వెంట నడిచిందని, భాస్కర్ రెడ్డి కుటుంబానికి జగన్ టికెట్ ఇస్తారని నాని కుండ బద్దలు కొట్టారు.