టాలీవుడ్ యంగ్ టైగర్ తారక్ , వైసీపీ నేత కొడాలి నానిల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీకి వ్యతిరేకంగా కాకుండా, వైసీపీకి అనుకూలంగా కాకుండా తారక్ వ్యవహరిస్తుంటారని టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినపుడు కూడా తారక్ తీవ్రంగా స్పందించకుండా గోడమీద పిల్లిలా రియాక్ట్ కావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తారక్ ను కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా విమర్శించారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై కొడాలి నాని స్పందించారు. టీడీపీని లోకేష్‌కు అప్పగించేందుకే పాదయాత్రలో జూ.ఎన్టీఆర్‌ను రైతులతో తిట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ నగరంపై టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు విషయం చిమ్ముతున్నారని ఆరోపించారు. విశాఖ దసపల్లా భూముల్లో టీడీపీ ఆఫీసు, టీడీపీకి సంబంధించిన వారి ఆఫీసులు ఉన్నాయని, అటువంటిది విజయసాయి రెడ్డి ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించారు.
ఒక అబద్ధాన్ని పవన్ కల్యాణ్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలేం అమాయకులు కాదని, వారు అన్నీ గమనిస్తున్నారని కొడాలి నాని అన్నారు. ఇక, దత్తపుత్రుడు పవన్ అజ్ఞానం తాజా ట్వీట్లతో బయటపడిందని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. అమరావతి పాదయాత్ర రైతుల యాత్ర కాదని, అది కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్ర అని భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో రాజధాని నిర్ణయానికి, కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసిందని, సెక్షన్ 6 ప్రకారం వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని కమిటీ నివేదికనిచ్చిందని తెలిపారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ ట్వీట్లల్లో పస లేకపోయినా, పేలకపోయినా, వాటిని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న పవన్…అమరావతి రాజధాని కావాలంటున్నారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు.