అమరావతి రాజధానిపై తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. కేవలం టీడీపీ నేతలకు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి న్యాయం చేసేందుకే అమరావతిని చంద్రబాబు రాజధానిగా ఎంచుకున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే, వైసీపీ నేతలు ఆరోపణలను టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. 2014కు ముందు అక్కడ భూములు ఉన్న వారి పేర్ల ప్రకారమే కేటాయింపులు జరిగాయని, ఎవరి భూములు ఎవరూ లాక్కో లేదని చెప్పుకొచ్చారు.
ఆ విషయాన్ని పట్టించుకోని వైసీపీ నేతలు…ఎస్సీ, ఎస్టీల భూములు లాక్కున్నామని, అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నానా రచ్చ చేశారని మండిపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పినా సరే వైసీపీ నేతలు వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులపై అంత ప్రేమ ఉన్న వైసీపీ నేతలు ఆ బిల్లును కోర్టు నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధానిపై మాట్లాడిన కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలో టీడీపీ నేతలు అందరికీ భూములున్నాయని, సినీ ప్రముఖులు అశ్వినీదత్, రాఘవేంద్రరావు వంటి వాళ్లకు కూడా అమరావతిలో కోరుకున్న చోట చంద్రబాబు భూములు ఇచ్చారని కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు. లేక్ వ్యూ ఉండేలాగా ఆ సినీ ప్రముఖులు భూమి కావాలని కోరారని, వారు కోరిన చోట చంద్రబాబు కారు చౌకగా వారికి భూమిని కట్టబెట్టారని కొడాలి నాని ఆరోపించారు.
టీడీపీ నేతలకు రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదని, కేవలం స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని కొడాలి నాని ఆరోపించారు. ఇక, ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా చౌదరి అమరావతి గురించి మాట్లాడుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. జగన్ రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రి అని, అమరావతి వంటి ఒక ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రి కాదని అన్నారు.