ప్రత్యేక హోదా వంటి సమస్యలు వదిలేసి సినిమా ఇండస్ట్రీపై పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మాదిరి విమర్శలు చేయడం సరికాదని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే చిరంజీవిపై వైసీపీ నేతలు మాటల దాడికి దిగారు. ఆ పకోడీగాళ్లకు చెప్పాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరుపై వైసీపీ నేతల విమర్శల నేపథ్యంలో వైసీపీ నేతలపై కూడా మెగా ఫ్యాన్స్ మాటలదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన వ్యాఖ్యలపై కొడాలి నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తమకు సలహాలు ఇచ్చినట్లే డాన్సులు, నటన చేతగాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్లకు కూడా చిరంజీవి సలహాలు ఇవ్వాలని మాత్రమే తాను చెప్పానని కొడాలి నాని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామని అన్నారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ వచ్చని….తాను మాట్లాడిన మాటలు ఆయన గురించి ఎలా అవుతుందని నాని అన్నారు. తన వెంట ఉన్న వారిలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని చెప్పుకొచ్చారు. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే అంత సంస్కారహీనుడిని కాదని కొడాలి నాని అన్నారు.
ఇక, చిరంజీవి అభిమానులు అంటూ టీడీపీ, జనసేన నేతలు గుడివాడ రోడ్లపై దొర్లారని, చిరంజీవికి వైసిపి నేతలకు మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. తాను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేన నేతలకు బూతులు గానే వినపడతాయని ఎద్దేవా చేశారు. తానేం మాట్లాడానో చిరంజీవికి ఆయన అభిమానులకు తెలుసని, తామంతా క్లారిటీగానే ఉన్నామని నాని అన్నారు. అయితే. జగన్ గురించి, వైసీపీ నేతల గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడుతానని నాని హెచ్చరించారు.
చిరంజీవి అంటే తనకు చాలా ఏళ్లుగా ఎంతో గౌరవం అని, ప్రజారాజ్యం సమయంలో తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి చేతులెత్తి దండం పెట్టిన ఘటనను నాని గుర్తు చేసుకున్నారు. ఎన్నోసార్లు చిరంజీవిని కలిశానని కూడా చెప్పుకొచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు తోట సాయి నిర్వహించిన చిరంజీవి జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును కొడాలి నాని కట్ చేశారు.
అయితే, కొడాలి నాని కామెంట్లపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. చిరును కొడాలి నాని అనలేదని కాసేపు అనుకున్నా..మరి, మిగతా వైసీపీ నేతలు చేసిన విమర్శల సంగతేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అడుసు తొక్కనేల కాలు కడగనేల అని ట్రోల్ చేస్తున్నారు.