జంగారెడ్డిగూడెం నాటు సారా మరణాల వ్యవహారం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చుకు టీడీపీ సభ్యులు పట్టుబడుతుండగా…వైసీపీ సభ్యులు మాత్రం అవన్నీ సహజ మరణాలేనంటూ చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. జంగారెడ్డిగూడెంలో 25 మంది నాటు సారా తాగి మరణించారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కొడాలి నాని ఖండించారు.
జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఘాటుగా స్పందించారు. పవన్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమేనని, వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసిపోరాడాలంటోన్న పవన్…టీడీపీలో చేరొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ను టచ్ చేసే నాయకుడు రాష్ట్రంలో లేరని, బలమైన సీఎం జగన్ అని అన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా 160 సీట్లలో సొంతంగా పోటీచేసే దమ్ము వైసీపీకి మినహా ఏ పార్టీకి లేదన్నారు.
ఒకవేళ ఏదైనా పార్టీ సింగిల్‌గా పోటీ చేసి 160 స్థానాల్లో విజయం సాధిస్తే.. తాను రాజకీయాలు వదిలేస్తానని కొడాలి నాని సవాల్ విసిరారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, మార్చి 3న మరణిస్తే.. విపక్ష నేతలు ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని నాని విమర్శించారు. కల్తీ మద్యం తాగి చనిపోతే పోలీస్ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టనంటే ఆయనతోపాటు తాము 43 మంది శాసనసభ్యులం అసెంబ్లీకి రాలేదని, కానీ, చంద్రబాబు రాకపోయినా లోకేశ్ శాసన మండలికి వస్తున్నారని, చంద్రబాబు మాట లోకేశే వినడం లేదని విమర్శించారు.