ప్రస్తుత వైసిపి నేత, టిడిపి మాజీ నేత కొడాలి నానికి దివంగత నేత నందమూరి హరికృష్ణ అత్యంత సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే. హరికృష్ణకు నమ్మిన బంటుగా వ్యవహరించిన కొడాలి నానికి ఆయన చలవతోనే అన్నగారు టికెట్ ఇచ్చారని అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్.. హరికృష్ణలే తనకు రాజకీయ భిక్ష పెట్టారని కొడాలి నాని కూడా ఎన్నో సందర్భాలలో చెప్పారు.
అయితే హరికృష్ణను కొడాలి నాని మోసం చేశారని. అందుకే ఆయనను హరికృష్ణ తన్ని తరిమేశారని టిడిపి మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇటీవల విమర్శలు గుప్పించారు. తారక్ ని కూడా కొడాలి నాని మోసం చేశారని, అందుకే ఆయనను తారక్ దూరం పెడుతున్నారని కూడా అనిత విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొడాలి నానిపై టిడిపి నేత రావి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.
గతంలో గుడివాడ నుంచి హరికృష్ణ పోటీ చేశారని, ఆ సమయంలో హరికృష్ణను కొడాలి నాని ఓడించారని వెంకటేశ్వరరావు ఆరోపించారు. నానిపై నమ్మకంతోనే గుడివాడ బరిలో హరికృష్ణ దిగారని, హరికృష్ణ ఓటమికి నాని కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో హరికృష్ణ పోటీని నాని జీర్ణించుకోలేకపోయారని, అందుకే కార్యకర్తలతో కలిసి హరికృష్ణను పరాజయం పాలు చేశారని ఆరోపించారు.
ఇటువంటి వెన్నుపోటు మనస్తత్వం ఉన్న నాని ఈరోజు నీతి వాక్యాలు వల్లిస్తుండడం సిగ్గుచేటని వెంకటేశ్వరరావు మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు చేసే నానికి గుడివాడ ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు. చేసిన తప్పులకు కొడాలి నాని సమాధానం చెప్పక తప్పదని, ఆయన జైలుకి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉందని వెంకటేశ్వరరావు అన్నారు.