ప్రజా సంక్షేమ పథకాలతో వైసీపీకి జనం పట్టం కట్టారని..జగన్ ను సీఎంను చేశారని వైసీపీ నేతలు గప్పాలు కొడుతోన్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా కూడా జనం కోసం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక, తాజాగా జగన్ చేసిన అప్పులపై వైసీపీ నేతలు కొత్త భాష్యం చెబుతున్నారు.
అప్పులు పదేళ్లలో అయినా తీర్చుకోవచ్చని…జనం ప్రాణాలు కాపాడేందుకు అప్పులు చేసిన గొప్ప సీఎం జగన్ అని మంత్రి కొడాలి నాని కితాబిచ్చేశారు. కరోనా వల్ల ప్రజలకు తినడానికి తిండి లేకపోతే…అప్పులు చేసి మరీ అన్నం పెట్టి ఆదుకున్న నాయకుడు జగన్ అని నాని అంటున్నారు. అప్పులు చేస్తే తప్పేంటని, ప్రజల కష్టాలను తీర్చడమే ప్రభుత్వ బాధ్యత అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు నాని.
కానీ, జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీడీపీ సహా విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీని జగన్ అప్పుల ఊబిలో దించుతున్నారని కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) పలుమార్లు తన నివేదికలో హెచ్చరించింది. వెల్లడించింది. జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో దాదాపు అర్థ రూపాయి అప్పేనని తేల్చి చెప్పింది. అయినప్పటికీ, ఏనుగు మీద నీళ్లుపడ్డట్టున్న జగన్ సర్కార్…తాజాగా తమ అప్పుల తప్పులను సమర్థించుకుంటోంది.
అశాస్ర్తీయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, కేంద్రం హామీలు నెరవేర్చకపోవడం వంటి విషయాలు ఏపీని కుంగదీశాయని జగన్ సర్కార్ ప్రకటించింది. రెవెన్యూ భారీగా పడిపోయినా కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, అందుకోసం భారీగా ఖర్చు చేశామని చెబుతోంది. 2014-19లో అప్పులు తారాస్థాయికి చేరాయని తన తప్పులను ఆ అప్పులను చంద్రబాబు సర్కార్ పై నెట్టేసింది. కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏడాది కాలంలో 18,48,655 కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందని కుంటిసాకులు చెబుతోంది.
ఇలా, అప్పులు చేస్తూ ఏపీ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోన్న జగన్ ను ఆ పార్టీ నేతలు సమర్థించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అప్పులు…తప్పులు చేస్తూనే ఉంటాం…అని బాహాటంగా చెబుతోన్న వైసీపీ నేతలు….అప్పు చేసి పప్పు కూడు పెట్టడం వల్ల భవిష్యత్తులో జనాలు తీవ్ర ఇబ్బందులు పడతారన్న సంగతిని మరచిపోతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.