వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి కొడాలి నానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇసుక ధందా చేస్తున్నారని పవన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. దాంతోపాటు, కొడాలి నానికి 150 ట్రక్కులున్నాయని, ఇసుక పేరుతో దోపిడీకి తెర తీశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కామెంట్లపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా స్పందించారు.
చిరంజీవి గారిలాంటి మంచి వ్యక్తి ఉన్న కుటుంబంలో పుట్టిన పవన్ కళ్యాణ్ కు ఎందుకు ఇంత ఖర్మ పట్టిందని కొడాలి నాని షాకింగ్ కామెంట్లు చేశారు.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతూ పవన్ నానాటికీ దిగజారిపోతున్నారని విమర్శించారు. రెండు చోట్ల ఓడిపోయినా పవన్ కు ఇంకా సిగ్గు రాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అధికారం నుంచి దించేయాలంటూ పవన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని కొడాలి నాని అన్నారు.
తాను ఇసుక పేరుతో డబ్బులు దోచుకుంటున్నానని, ఇసుక దందా చేస్తున్నానని పవన్ తప్పుడు ఆరోపణలు చేయడం తగదని అన్నారు. గుడివాడకు వచ్చి తనకు ఐదు లారీలు, 150 ట్రక్కులు ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని పవన్ కు నాని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉచితంగా ఇసుక అందించిందని కొడాలి నాని అన్నారు.
చీకోటి ప్రవీణ్ పై ఈడీ దాడులు చేయించి రాజకీయ ప్రత్యర్థులు కుట్ర పన్నారని అన్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంలో తనను, వల్లభనేని వంశీని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని, తమ పేర్లు చెప్పాలని చీకోటి ప్రవీణ్ పై ఒత్తిడి చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఇక, ఫేక్ వీడియోతో గోరంట్ల మాధవ్ పై దుష్ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని అన్నారు.