ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని, ప్రత్యర్థులు నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు భారా స్థాయిలో విజయాలు నమోదు చేస్తుండడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. దీంతోపాటు, మంత్రి కొడాలి నాని నియోజకవర్గంలో ఉన్న 58 పంచాయతీలకుగాను 20 టీడీపీ కైవసం చేసుకోవడం, కొడాలి నాని సొంత ఊరు ఎలమర్రు సర్పంచ్ స్థానాన్ని టీడీపీ బలపరిచిన అభ్యర్థి కైవసం చేసుకోవడం చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలోనే సొంత ఊర్లో కొడాని నాని ఓడిపోయారని, వైసీపీపై ప్రజల వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సర్పంచ్‌గా గెలిస్తే ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని షాకింగ్ కామెంట్లు చేశారు. చిత్తూరులో లోకేష్ పోటీచేసి పంచాయతీ సర్పంచ్ గా గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని గతంలో నాని ఇదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, మంత్రి అయి ఉండీ సొంతూళ్లోనే సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిన నాని….నారా లోకేష్ పై విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం ఉంది కదా అని విపక్ష నేతలను బూతులు తిడితే ప్రజలు ఓట్లేయరని, అధికారం శాశ్వతం కాదని ప్రజలు మరోసారి నిరూపించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లోకేష్, చంద్రబాబులపై విమర్శలు గుప్పించడం మాని…తన సొంత ఊరు, నియోజవర్గంలోని సమస్యలపై నాని దృష్టి పెట్టకుంటే….రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నానికి ప్రజలే బుద్ధి చెబుతారని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.