టీడీపీ కార్యకర్తలుగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నానిలు ప్రస్తుతం టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లపై విషం చిమ్మడం తప్ప మరో పనేదీ లేనట్లుగా వారి వ్యాఖ్యలుండడం విశేషం. దీంతో, ఆ ఇద్దరు నేతలపై కూడా టీడీపీ నేతలు సమయానుచితంగా అదే రేంజ్ లో ప్రతి విమర్శలు చేస్తూ దీటుగా బదులిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా వంశీ, కొడాలి నానిలపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీల ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా సహాయంతో గుత్తా వేణుగోపాల్ కృష్ణ, కిరణ్ అనే బినామీలు సంకల్పసిద్ధి ఈమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారని ఆయన ఆరోపించారు. లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఆ కంపెనీ రూ. 1,100 కోట్ల భారీ స్కామ్ కు పాల్పడిందని ఆరోపించారు.
రూ. 20 వేలు కడితే 10 నెలల్లో రూ. 60 వేలు ఇస్తామని నమ్మబలికి జనాన్ని ఆ సంస్థ మోసం చేసిందని ఆరోపించారు. బోగస్ కంపెనీ సంకల్పసిద్ధి రిజిస్టర్ అయిన తర్వాత వంశీ 3 నెలలు ఎందుకు మాయమయ్యారని పట్టాభి ప్రశ్నించారు. కొట్టేసిన పేదల సొమ్మును దాచిపెట్టేందుకు ఆయన మాయమయ్యారా? అని నిలదీశారు. గన్నవరం నియోజకవర్గంలో డయేరియాతో పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా వంశీ ఎందుకు కనపడడంలేదని ప్రశ్నించారు.
పేదల సొమ్మును కొట్టేసిన నాని, వంశీలపై కేసులు నమోదు చేయాలని, అలా చేసి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పట్టాభి అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని, ఈ స్కామ్ కు సంబంధించిన వార్తను సాక్షి పత్రికలో ఎందుకు ప్రచురించలేదని పట్టాభి నిలదీశారు.