లడఖ్.. కిషన్ రెడ్డి.. తెలుగు సెంటిమెంట్ కు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించేటోళ్లు కనిపిస్తారు. కానీ.. కాస్త లోతుగా విషయాన్ని చూస్తే.. కేంద్రసహాయమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డిని ప్రశంసించకుండా ఉండలేని పరిస్థితి. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు పలువురు.. కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవుల్ని చేపట్టారు. ఇటీవల కాలంలో వారెవరూ కూడా ఒక జాతీయ అంశంపై బలంగా తమ వాదనను వినిపించటం కానీ.. ప్రత్యర్థిదేశాలకు లాగి పెట్టి ఒక్కటి ఇచ్చేలా కానీ వ్యాఖ్యలు చేసింది లేదు. ఆ కొరతను తీర్చేశారు కిషన్ రెడ్డి.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి.. తాజాగా లఢఖ్ లో ఏర్పాటు చేసిన ఒక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తో పాటు.. కశ్మీర్ ప్రాంతానికి చెందిన పార్టీలు వ్యవహరిస్తున్న తీరును దుమ్మెత్తి పోయటమే కాదు..చైనా.. పాకిస్థాన్ ల తీరును తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైనం ఇప్పుడు ఆకర్షించక మానదు.
తెలుగు ప్రాంతానికి చెందిన నేతలు ఢిల్లీ కారిడార్ లో వ్యాపార ప్రయోజనాలు.. కార్పొరేట్ దందాలు..లాబీయింగ్ చేయటం.. ప్రాజెక్టులు.. పర్మిషన్లు లాంటి వాటికే పరిమితం అవుతారే తప్పించి.. ఇంక వేటికి వారు పనికి రారన్నభావన తప్పన్న విషయాన్ని కిషన్ రెడ్డి నిరూపించారు. అందుకే.. ఆయన్ను అభినందించాల్సిందే. చాలా కాలం తర్వాత తెలుగు ప్రాంతానికి చెందిన నేత ఒకరు జాతీయ అంశాల మీద మాట్లాడటం.. స్పష్టమైన వాదనల్ని వినిపించటం చేశారని చెప్పాలి.
దశాబ్దాలుగా తేలని పంచాయితీల్ని సెట్ చేసేస్తూ.. ఏడాది క్రితం ఆర్టికల్ 370ను రద్దు చేయటం.. లడఖ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించటంతో పాటు.. జమ్ముకశ్మీర్ విషయంలో తీసుకోవాల్సిన సాహసోపేతమైన నిర్ణయాల్ని మోడీ సర్కారు తీసుకుంది. ఈ నిర్ణయాల్ని జమ్ము.. లడ్ ఖ్ ప్రాంతానికి చెందిన ప్రజలు సంపూర్ణంగా స్వాగతిస్తుంటే.. కశ్మీర్ కు చెందిన పలువురు మాత్రం విబేధిస్తున్నారు. ఇటీవల హౌస్ అరెస్టు నుంచి బయటకు వచ్చిన నేషనల్ కాన్ఫరెన్సు.. పీపపుల్స్ డెమోక్రటిక్ పార్టీలతో కలిసి జాతీయ పార్టీగా చెప్పే కాంగ్రెస్.. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370ను పునరుద్దరిస్తామని చెప్పటాన్నితప్పు పడుతున్నారు.
ఈ అంశాన్ని తాజాగా ప్రస్తావించిన కిషన్ రెడ్డి.. సభకు హాజరైన ప్రజల్ని మీరు కేంద్రపాలిత ప్రాంత హోదాను కోరుకుంటున్నారా? లేదా? అని ప్రశ్నించగా.. అక్కడి వారు మోడీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించటం గమనార్హం. లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించటాన్నిచైనా.. పాకిస్తాన్ లో తప్పుపట్టటం.. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను తీవ్రస్థాయిలో తప్పు పట్టిన కిషన్ రెడ్డి.. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి చైనా ఎవరంటూ సూటిగా ప్రశ్నించారు.
ఏళ్లకు ఏళ్లుగా లడఖ్ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని.. దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని చేస్తున్న డిమాండ్లను కేంద్రంలోని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే.. మోడీసర్కారు ఆ దిశగా నిర్ణయం తీసుకుందన్నారు. ఏమైనా.. జాతీయఅంశాల మీద మనోడు.. సమస్య ఉందని చెప్పే ప్రాంతానికి వెళ్లి మరీ క్లియర్ గా తన వాణిని.. పార్టీ.. ప్రభుత్వ లైన్ ను చెప్పేసిన తీరును అభినందించక తప్పదు.