2009 సెప్టెంబరు 2.. తెలుగు వారు ఎప్పటికీ మరిచిపోలేని తేదీల్లో ఇది ఒకటి. ఆ రోజే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. అది తెలుగు చరిత్రలోనే అతి పెద్ద విషాదాల్లో ఒకటి. నిజానికి ఆ రోజు వైఎస్‌తో పాటు అప్పటి చీఫ్ విప్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా అందులో ప్రయాణించాల్సిందట. ఆయన కూడా ప్రాణాలు కోల్పోవాల్సిందట.
తాను ఎలా ఆ ప్రయాణానికి దూరం అయి ప్రాణాలు కాపాడుకున్నానో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’లో కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు.
ఈ ఎపిసోడ్‌కు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డితో పాటు సీనియర్ నటి రాధిక కూడా అతిథులుగా హాజరయ్యారు. ఇంతకీ వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదం గురించి కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..
‘‘హెలికాఫ్టర్ ప్రమాదం జరగడానికి ముందు రోజు వైఎస్ నాతో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో పని పని పూర్తి కావాల్సి ఉంది. 1.45కు సీఎం రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎవరిని నియమిస్తున్నావని అడిగారు.. నేను ప్రతిపక్ష నేత నాగం జనార్థన్ రెడ్డి పేరు పంపారని చెప్పాను. లేదు శోభానాగిరెడ్డిని నియమించాలని వైఎస్సార్ నాతో చెప్పారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో పాటు ఇంకో రెండు కమిటీలను ప్రకటించాల్సి ఉంది. మరుసటి రోజు కమిటీలను అనౌన్స్ చేయాలని అనుకున్నాం. ఆ రోజు రాత్రి 8 గంటలకు రాజశేఖర్ రెడ్డితో పాటూ చిత్తూరు వెళ్లాల్సింది. కానీ ఆ పర్యటనను రద్దు చేసుకున్నాను.
మరుసటి రోజు నేను ఆఫీసులో కూర్చుని కమిటీలను రెడీ చేస్తున్నాను.. చిత్తూరు నుంచి ఫోన్ వచ్చింది. నేను ఎక్కడున్నానని అవతలి వ్యక్తి అడిగారు.. నేను నా ఆఫీస్‌లో ఉన్నాను అని చెప్పాను. వైఎస్సార్ ఇంకా రాలేదని అడిగారు. నేను సీఎం గారి ఆఫీసుకు ఫోన్ చేసి సీఎం ఎక్కడున్నారని అడిగితే వాళ్లకు కూుడా తెలియదు. రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ కూలిపోయిందని తర్వాత తెలిసింది’’ అని కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు.
తాను ఆ రోజు వైఎస్‌తో కలిసి ప్రయాణం చేయలేదు కాబట్టి బతికి ఉన్నానని, కాబట్టే ముఖ్యమంత్రి కూడా అయ్యానని ఆయనన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చాలా బాధ పడ్డానని.. ఇప్పుడు అంతా సవ్యంగానే ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
మూడు రాజధానుల మీద మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయం.
అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారు, రివర్స్ లో వెళ్ళే ఒక్కడు తప్ప pic.twitter.com/g68K2CxYgN
— CBN ARMY VIZAG (@Cbnarmyvizag) November 25, 2022