టీడీపీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు.కింజరాపు కుటుంబం నుంచి మరో వారసుడు రాబోతున్నాడు.
టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కొడుకు కృష్ణ మోహన్ నాయుడు రాజకీయ అరంగేట్రం చేయనున్నాడు.
ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి తాను చేపట్టిన కార్యక్రమాల సరళిని వివరించాడు.
ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో మరో కొత్త ముఖం సందడి చేయనుంది.ఈయనతో పాటు మరో వారసుడు కూడా అరంగేట్రం చేయనున్నాడు. ఆయనే ఎర్రన్న మరో సోదరుడి కుమారుడు కూడా కింజరాపు హరి వర ప్రసాద్ కొడుకు సురేశ్ నాయుడు (ఉన్నత విద్యను అభ్యసించారు) కూడా ఇటుగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
వీరితో పాటు గుండ కుటుంబం నుంచి ఈ సారి ఎన్నికల్లో పోటీచేసేందుకు వారింటి చిన్నబ్బాయి గుండ విశ్వనాథ్ అలియాస్ విస్సు రానున్నాడు.
ఈయన కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని తండ్రి ఆదేశానుసారం పనిచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ అమెరికాలో ఉద్యోగ రీత్యా స్థిరపడిపోయారు.
దీంతో ఈయన ఇటుగా వచ్చేందుకు పదే పదే ఆలోచించారు. ఎట్టకేలకు శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యే అదే సామాజిక వర్గ నేత ఆ ఇంటి బంధువు ధర్మాన ప్రసాదరావును ఢీ కొనేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇక అచ్చెన్న వారసుడిగా కృష్ణమోహన్ రాకపై చాలా అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఎర్రన్నాయుడు వారసుడు రామ్మోహన్ నాయుడు (రాము) దేశ రాజకీయాలలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
బాబాయ్ – పిన్నీ ఇద్దరూ కూడా ఆయనంటే ఎంతో ప్రేమ,ఆదరం చూపిస్తూ ఆయన ఎదుగుదల చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు.
అదే విధంగా తమ కుమారుడు కూడా రాము స్ఫూర్తితో రాణించాలి అని భావిస్తున్నారు.మరోవైపు రామూ సోదరి భవాని రాజమహేంద్రి ఎమ్మెల్యే గా ఉన్నారు.ఆమె కూడా
అసెంబ్లీలో వాగ్ధారతో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.ఈ ఇద్దరి మాదిరిగానే తన కొడుకు ఇంకొంత పరిణితి సాధించి, జిల్లా రాజకీయాల్లో పేరుతెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇప్పటికే నరసన్నపేట నియోజకవర్గంపై దృష్టిసారించిన కృష్ణ మోహన్,ఇటు తండ్రి సొంత నియోజకవర్గం టెక్కలి నియోజకవర్గంలోనూ యాక్టివ్ గానే ఉంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రాజకీయ అరంగేట్రం చేయాలని భావిస్తున్నాడు.అటుపై శాసన సభలో అడుగుపెట్టాలని భావిస్తున్నాడు.ఇదే సమయంలో సొంత కుటుంబం నుంచే కొంత పోటీ ఉంది.
దీంతో ఆయన రాక స్పష్టం అయినా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీపై ఇప్పటికైతే స్పష్టత అయితే లేదు.