కరోనా నేపథ్యంలో మాస్క్, శానిటైజర్ మన జీవితాల్లో అంతర్భాగమయ్యాయి. అవసరానికి తగ్గట్టుగానే మార్కెట్ లోకి రకరకాల శానిటైజర్లు, మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటి ఫ్లోర్ ను రోజూ శానిటైజ్ చేయడం..తరచూ చేతులను శానిటైజర్ తో శుభ్రపరచడం నిత్యకృత్యమయ్యాయి. ఈ క్రమంలోనే శానిటైజర్లు, మాస్కుల్లోనూ వినూత్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి కొన్ని కంపెనీలు.
ఈ నేపథ్యంలో ఓ కొత్త రకం శానిటైజర్ ను ఐఐటీ హైదరాబాద్ అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక టెక్నాలజీతో కొవిడ్ రక్షణ ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. ఉపరితలం (సర్ఫేస్), టేబుళ్లు, కుర్చీలు, సోఫా లాంటి వాటిపై ఈ ఫ్లోర్ క్లీనర్ ను ఒక్కసారి స్ర్పే చేస్తే చాలు.. 35 రోజుల వరకు దాని ప్రభావం ఉంటుంది. ఇక, హ్యాండ్ శానిటైజర్‌ను ఒక్కసారి వినియోగిస్తే దాని ప్రభావం 24 గంటల వరకు ఉంటుంది.
నానో ఫార్ములేషన్ కోటింగ్ టెక్నాలజీని ఐఐటీ హైదరాబాద్ లో పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంతేకాదు, దీనికి పేటెంట్ కూడా పొందారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ స్టార్టప్ కంపెనీ కియా బయోటెక్ ‘డ్యూరోకియా’ పేరుతో వీటిని రూపొందించింది. కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు తక్కువ ధరలకే అందరికీ స్ర్పే, హ్యాండ్ శానిటైజర్లను అందించాలన్న లక్ష్యంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ శుక్రవారం ఆన్లైన్లో జరగనున్న ఓ కార్యక్రమంలో ఈ ఉత్పత్తులను ప్రారంభిస్తారు. నేటి నుంచి అమెజాన్‌లో వీటి అమ్మకాలు మొదలుకానున్నాయి. ఇతర మాల్స్‌లోనూ వీటిని అందుబాటులోకి తేనున్నారు. మార్కెట్ లో ఉన్నవాటికంటే తక్కువ ధరకే వీటిని విక్రయించనున్నారు.
కియా బయోటెక్ డ్యూరోకియా పేరుతో రూపొందించిన ఉత్పత్తులివే:
డ్యూరోకియా-ఎస్: ఫ్లోర్ క్లీనింగ్, టేబుళ్లు, సోఫాలు, ఇంట్లోని ఇతర వస్తువులను దీంతో శుభ్రపరచవచ్చు. ఎథనాల్ మిశ్రమంతో కూడిన ఈ రసాయనంతో ఒకసారి శుభ్రపరిస్తే 35 రోజుల వరకు రక్షణ ఉంటుంది. ఎలాంటి వైరస్ దరిచేరదు.
డ్యూరోకియా-హెచ్: ఇథనాల్ మిశ్రమంతో కూడిన హ్యాండ్ శానిటైజర్ ఇది. దీంతో ఒకసారి చేతులు శుభ్రపరిస్తే.. ఆ ప్రభావం 24 గంటల వరకు ఉంటుంది. నానో ఫార్ములేషన్ కోటింగ్ టెక్నాలజీతో చేతిపై రసాయన పొర ఏర్పడుతుందని, ఎలాంటి వైరస్ దరిచేరదంటున్నారు.
డ్యూరోకియా-ఎం: ఇందులోని యాంటీవైరస్ కోటింగ్ స్ర్పేతో మాస్కులను శుభ్రపరచుకోవచ్చు. ఎన్-95, కాటన్ మాస్కులతో పాటు ఒకసారి వాడిపడేసే సర్జికల్ మాస్కులనూ దీంతో శుభ్రపరచుకుని వినియోగించుకోవచ్చు.
డ్యూరోకియా-హెచ్ ఆక్వా: ప్రస్తుతం ఆల్కహాల్‌తో కూడిన హ్యాండ్ శానిటైజర్లే అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కువగా వినియోగిస్తే చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆల్కహాల్ లేకుండా శానిటైజర్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని చిన్నారులూ వాడొచ్చు.