కరోనా మహమ్మారి ధాటికి దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కోవిడ్-19 దెబ్బకు పలు దేశాలు అనివార్య పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడంతో వారి ఆర్థిక వ్యవస్థలు కుప్పుకూలాయి. దీంతో, పలు దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ కోవలోని ఆసియాలోని శ్రీలంక కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. పర్యాటక రంగంతోపాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ప్రధాన పరిశ్రమలు టీ, వస్త్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.
దీంతో, ఆదాయం లేక, ఆ దేశ ఆర్ధిక పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లంకలో కేజీ చికెన్ రూ.1000 పలుకుతోందంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఇక, ఒక్కో గుడ్డు 35 రూపాయలు, కిలో ఉల్లిపాయలు 250, కేజీ బియ్యం 200 రూపాయలు కావడంతో సామాన్యులు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది.
సెంట్రల్ బ్యాంక్ దగ్గరున్న విదేశీ మారక ద్రవ్య విలువలు పడిపోవడంతో విదేశీ మారక ధరలు పెరిగాయి. శ్రీలంకన్ కరెన్సీలో 230 రూపాయలుగా ఉన్న యూఎస్ డాలర్ విలువ 270కి పెరగడంతో వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ రెట్టింపుకాగా వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూతపడ్డాయి. నిత్యావసరాల కోసం, పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూలలో బారులు తీరుతున్నారు.
ఈ ఆర్ధిక సంక్షోభం నడుమ, శ్రీలంకలో తీవ్రమైన విద్యుత్ కోత…డీజిల్ కొరతతో జనరేటర్లు వాడలేని పరిస్థితితో జనం ఇక్కట్లు పడుతున్నారు.
1970లలో సిరిమావో బండారు నాయకే ప్రధానమంత్రిగా ఉన్నపుడు ఏర్పడిన కరువు కన్నా ప్రస్తుతం ఉన్న సంక్షోభం దారుణమని అంటున్నారు.