చంద్రయాన్ -2తో పడిన దెబ్బతో నేర్చుకున్న పాఠాలతో మూడోసారి చంద్రయాన్-3 ను ప్రయోగించటం.. అది సక్సెస్ ఫుల్ గా షెడ్యూల్ కు తగ్గట్లుగా దూసుకెళుతున్న విషయం తెలిసిందే. చంద్రయాన్ చివరి అంకమైన.. చంద్రుడి దక్షిణ భాగంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రంగం సిద్ధమవుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 23న చంద్రయాన్ చంద్రుడి మీద కాలు మోపనుంది. ఇదిలా ఉంటే.. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఫోటోల్ని తీసింది.
సదరు ఫోటోలతో కూడిన వీడియోను ఇస్రో సోషల్ మీడియాలో షేర్చేసింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయినంతనే ల్యాండర్ తీసిన ఫోటోలను ఇస్రో ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23న (బుధవారం) చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద డెబ్భై డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కానుంది. తాజాగా పంపిన ఫోటోల్ని చూసినప్పుడు.. చంద్రుడి ఉపరితలం మీద ఉన్న బిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఫ్యాబ్రీ క్రేటర్.. గియార్డనో బ్రూనో క్రేటర్.. హర్కే బి జే క్రేటర్ అంటూ ఇస్రో ఫోటోల్లోని ప్రాంతాల వివరాల్ని వెల్లడించింది. తాజాగా పేర్కొన్న మూడు క్రేటర్లలో గియార్డనో బ్రునో అన్నది చంద్రుడిపై ఇటీవల గురించిన అతి బిలంగా చెప్పాలి. మరో బిలమైన హర్కేబి జే క్రేటర్ వ్యాసం అయితే ఏకంగా 43 కిలోమీటర్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్ వేగాన్ని తగ్గించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ఇస్రో చెబుతోంది. మరి.. అల్లంత దూరాన ఉన్న చంద్రుడికి అత్యంత సమీపం నుంచి తీసిన ఫోటోల వీడియోను చూసేయండి.