దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా నమోదు కావడం కలవరపెడుతోంది. అయితే, తెలంగాణతోపాటు ఏపీలోనూ లాక్ డౌన్ సత్ఫలితాలనిస్తుండడంతో గత రెండు వారాలుగా కేసుల సంఖ్య కొంతవరకు తగ్గుముఖం పట్టింది. దీంతో, తెలంగాణలో మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండో విడత లాక్ డౌన్‌కు విధించిన గడువు నేటితో పూర్తికానుండడంతో మరో లాక్ డౌన్ ఉంటుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరో లాక్ డౌన్ పై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. లాక్‌డౌన్‌ను పొడిగించాలా..సడలించాలా అన్న విషయాన్ని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం జరిగే మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించనున్నారు.
ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో వారం లేదా పది రోజులు పాటు పొడిగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే, సడలింపు వేళల్లో మరికొంత వెసులుబాటు కల్పించనున్నట్టు తెలుస్తోంది. మే 12వ తేదీ మొదలుకొని ఉదయం 6 నుంచి 10 గంటల వరకు 4 గంటలపాటు మాత్రమే అన్ని వర్తక, వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు.
ఒకవేళ తదుపరి లాక్ డౌన్ ఉంటే…5 నుంచి 6 గంటలపాటు దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతినిచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 20 గంటల లాక్డౌన్ సమయాన్ని 18 గంటలకు కుదించే చాన్స్ ఉందట. అంతేకాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆంక్షలు ఎత్తివేసి, రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశముందని తెలుస్తోంది.