టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై, టీడీపీ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. అయితే, దాడి చేసిన వైసీపీ శ్రేణులను జగన్ వెనకేసుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు …జగన్ ఫ్యాక్షన్, కక్షా రాజకీయాలపై ఫిర్యాదు చేశారు. ఇక, అందుకు ప్రతిగా వైసీపీ ఎంపీలు…టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కంప్లయింట్ చేశారు. అందుకు కొనసాగింపుగా తాజాగా కోవింద్‌ను వైసీపీ ఎంపీలు కలిశారు.
ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీలకు టీడీపీ ఎంపీలు ఘాటుగా జవాబిచ్చారు. ప్రతిపక్ష నేతపై అసభ్యపదజాలం వాడవచ్చా అని ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. అన్నగారు స్థాపించిన పార్టీ నేటివరకు ఎన్నో ఆటుపోట్లను, సంక్షోభాలను తట్టుకుందని నాని అన్నారు. జగన్ హయాంలో ఏపీలో మునుపెన్నడూ లేని కొత్త పరిణామాలు, పోకడలు వస్తున్నాయని మండిపడ్డారు. సీఎం పదవి ఒక్కటే రాజ్యాంగబద్ధమైన పదవి కాదని, ప్రతిపక్ష నేత పదవి కూడా రాజ్యాంగబద్ధమైనదేనని అన్నారు.
ప్రతిపక్ష నేతపై సిట్టింగ్ ఎమ్మెల్యే దాడి చేయడం ఎంతవరకు సమంజసమని నాని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేయించిన వారికి రాష్ట్రపతిని కలిసే నైతిక హక్కు లేదననారు. ప్రజా సమస్యలపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష నేతలపై దూషణలు, దాడులు, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ తప్పులు సరిదిద్దుకోకపోతే ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు.
ఇక, రాష్ట్రపతిని వైసీపీ ఎంపీలు కలవడం దురదృష్టకమని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. గతంలో ప్రతిపక్షంలో జగన్ ఉన్నప్పుడు చంద్రబాబుపై వాడిన భాష ఎలాంటిదో గుర్తు చేసుకోవాలని దుయ్యబట్టారు. అనాగరిక భాష వాడుతున్న వైసీపీ నేతలు నీతులు చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. వైసీపీ సంస్కృతి, నాగరికత లేని పార్టీ అని విరుచుకుపడ్డారు.