ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అ య్యారు. ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా త్వరలోనే రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన దీనికి ముహూర్తం రెడీ చేసుకుంటున్నారు. అయితే.. అసలు టీడీపీకి, కేశినేనికి ఎక్కడ చెడిపోయింది? ఎందుకు విభేదాలు వచ్చాయి? చివరకు పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వనిపరిస్థితి, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి ఎందుకు వచ్చాయి? అనేది రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.
కర్ణుడి చావుకు.. అన్నట్టుగా కేశినేని-టీడీపీల మధ్య అంతరం పెరిగేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నా యి. 2014కు ముందు.. చంద్రబాబు చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా.. రాజకీయ అరంగేట్రం చేసిన ట్రావెల్స్ యజమాని.. కేశినేని, 2014లో చంద్రబాబు మెప్పు పొంది.. టికెట్ సంపాయించుకున్నా రు. ఆయన గెలిచారు. ప్రభుత్వం కూడా ఏర్పడింది. అయితే.. అప్పటి వరకు సౌమ్యుడిగా ఉన్న కేశినేని.. అనూహ్యంగా ఒంటెత్తు పోకడలు పోయారు.
తనను మించిన నాయకుడు లేరని ఆయన భావించారు. ఇది నిర్వివాదాంశం. ఏకంగా ఆర్టీఏ అధికారిపై నే దౌర్జన్యానికి దిగి.. ప్రభుత్వాన్ని సైతం ఇరకాటంలోకి నెట్టారు. దీంతో ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక, పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేకుండా.. అప్పట్లోనే ఎంపీ లాడ్స్‌ను తన ఇష్టానుసారం ఖర్చు చేశారు. దీనిపైనా అప్పట్లోనే పార్టీలో అంతర్గత వివాదం జరిగింది. అయినప్పటికీ.. చంద్రబాబు ఎంతో సహనంతో వ్యవహరించారనేది కూడా తెలిసిందే.
2019లోనే కేశినేని చిన్న(శివనాథ్) టికెట్ కోసం పార్టీపై ఒత్తిడి పెంచారు. ఆయన కూడా అప్పట్లో పార్టీ తరఫున కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. చంద్రబాబు కేశినేని నాని వైపు మొగ్గు చూపారు. ఇంతగా చంద్రబాబు సహనం వహించి.. కేశినేని నాని కోసం.. ప్రయత్నిస్తే.. ఆయన మాత్రం ఎప్పుడూ తిరుగుబాటు ధోరణిలోనే వ్యవహరించారనేది టీడీపీ నేతల మాట. తన తరఫున జెండా మోసి, రెండో సారి గెలిపించిన నాయకులను పక్కన పెట్టారు. అంతేకాదు.. తాను లేకపోతే.. విజయవాడలో పార్టీనే లేదని అన్నారు.
“టీడీపీ గుర్తుకే ఓటేసి ఉంటే.. నేను ఒక్కడినే ఎందుకు గెలిచాను. మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయింది?“ అని నర్మగర్భంగా తన గొప్పలు చెప్పుకొచ్చారు. తర్వాత.. కాలంలో సొంత పార్టీ నాయకులను దూరం చేసుకున్నారు. వారిపైనే తీవ్ర విమర్శలు చేశారు. ఏకంగా .. నారా లోకేష్‌పైనా విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వంటి పశ్చిమ నియోజకవర్గంలో బలమైన నాయకులు తిరుగుబావుటా ఎగురవేసినా.. చంద్రబాబు సర్ది చెప్పారు.
ఇంతగా చంద్రబాబు తన కోసం పాకులాడినా.. నాని మాత్రం వైసీపీ నేతలతో చేతులు కలిపారు. వారితో కలిసి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఇంటింటికీ పింఛను, వలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలపై ప్రశంసలు గుప్పించారు. ఇన్ని చేసినా.. ఇప్పటి వరకు చంద్రబాబు సహిస్తూనే ఉన్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా.. పార్టీలోనే చీలికలు తెచ్చేందుకు.. వర్గం ముద్రలు వేసేందుకు ప్రయత్నించిన దరిమిలా.. చంద్రబాబు పక్కన పెట్టాల్సి వచ్చిందనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.