విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. బెజవాడ ఎంపీ టికెట్ ను నానికి ఇవ్వడం లేదని చంద్రబాబు చెప్పడంతో ఆయన పార్టీని వీడారు. ఈ క్రమంలోనే నిన్న జగన్ ను కలిసిన వెంటనే మీడియాతో మాట్లాడిన నాని…చంద్రబాబు, లోకేష్ లపై తీవ్రస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తన సోదరుడు కేశినేని నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని స్పందించారు. చంద్రబాబు, లోకేష్ లను విమర్శించే స్థాయి కేశినేనిది కాదని ఆయన అన్నారు.
తన కుటుంబం తరఫున చంద్రబాబు, లోకేష్ లకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. కేశినేని కుటుంబ గొడవలతో చంద్రబాబు, లోకేష్ లకు సంబంధం లేదని చిన్ని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో గొడవలు వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని అన్నారు. పార్టీ పెట్టక ముందు నుంచే తమ కుటుంబంలో గొడవలున్నాయని, కేశినేని కుటుంబ సభ్యుడిగా ఎప్పటికప్పుడు తానే సర్దుకున్నానని అన్నారు. తనపై నాని ఎన్ని విమర్శలు చేసినా..తాను ఏనాడూ మీడియా ముందుకు వచ్చి ఆయనపై విమర్శలు చేయలేదని తెలిపారు.
ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, కానీ, తాను ఎంపీగా పోటీ చేస్తానని ఏనాడూ చెప్పలేదని అన్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబును ఎన్నడూ కలవలేదని, తన సేవా కార్యక్రమాల గురించి మాత్రమే చంద్రబాబుతో ఒకటి రెండు సార్లు మాట్లాడానని అన్నారు.కేశినేని నాని పదే పదే తన స్థాయి అదని, ఇదని చెప్పుకుంటాడని చిన్ని విమర్శించారు. తనది టాటా, మోడీ రేంజ్ అంటూ కేశినేని నాని తనకు తానే చెప్పుకుంటుంటారని, కానీ, ఆయన స్థాయిని నిర్ణయించాల్సింది, నిర్ణయించేది ప్రజలేనని చిన్ని అన్నారు. సొంత డబ్బా కొట్టుకుంటే స్థాయి పెరగదని చురకలంటించారు.
మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా, స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా వారి బాటలో నడుస్తూ లోకేశ్ ప్రజల మన్ననలు పొందారని, యువగళం పాదయాత్రకు లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు హాజరయ్యారని గుర్తు చేశారు. వెన్నంటి నడిచారని గుర్తుచేశారు. అటువంటి లోకేష్ స్థాయి గురించి మాట్లాడే స్థాయి నానికి లేదని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని చిన్ని అన్నారు. చంద్రబాబు వస్తేనే అమరావతి రాజధాని సాధ్యమన్నారు.