ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అవకాశం చిక్కిన ప్రతిసారీ నిప్పులు చెరిగే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్.. తాజాగా మరోసారి.. సైలెంట్‌గా మోడీని పెద్ద చిక్కులోనే ఇరికించేశారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకు లేని కొత్త డిమాండ్‌ను ఆయన తెరమీదికి తెచ్చారు.
ఇది సాధ్యం కాదని తెలిసినా.. వ్యూహాత్మకంగా మోడీని కేజ్రీవాల్ ఇరికించేశారని అంటున్నారు పరిశీలకు లు. విషయం ఏంటంటే.. గడిచిన రెండేళ్లుగా దేశంలో వైద్యులు కరోనా బారిన పడిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
అయితే.. దేశంలోని వైద్యులందరికీ ఈ ఏడాది భారతరత్న ప్రకటించాలని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కొవిడ్ వేళ తమ ప్రాణాలను లెక్కచేయకుండా వారు అందించిన సేవలకు ఇచ్చే గౌరవం ఇదేనని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
కరోనా సమయంలో అమూల్యమైన సేవలందించిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ఈ ఏడాదికి గానూ భారతరత్న ప్రకటించాలని సూచించారు. కొవిడ్ వేళ ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు ఇదే అసలైన నివాళి అవుతుందని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
“భారతీయ వైద్యులు ఈ ఏడాది భారతరత్న స్వీకరించాలి. భారతీయ వైద్యులు అంటే ఇందులో దేశంలోని వైద్యులు, నర్సులు, పారామెడిక్ సిబ్బంది ఉంటారు. అమరులైన వైద్యులకు ఇచ్చే అసలైన గౌరవం ఇదే. తమ జీవితాలు, తమ కుటుంబ సభ్యుల జీవితాలను లెక్కచేయకుండా సేవ అందిస్తున్నవారికి అందించే గొప్ప గౌరవం ఇది.
మొత్తం దేశం దీనికి ఆనందిస్తుంది.“ అని పేర్కొన్నారు. అయితే.. ఇది అసాధ్యమైన, ఆశ్చర్యకరమైన విజ్ఞప్తి అంటున్నారు పరిశీలకులు. ఇదిలావుంటే.. కేజ్రీవాల్ విజ్ఞప్తిని వైద్యుల సంఘాలు స్వాగతిస్తున్నాయి. త్వరలోనే మోడీకి తాము కూడా విజ్ఞాపనలు పంపుతామని అంటున్నాయి. దీంతో ఇప్పుడు అత్యంత సున్నితమైన ఈ విషయంలో మోడీ ఎలా వ్యవహరిస్తారో చూడాలని అంటున్నారు పరిశీలకులు.