తప్పు చేయటమన్నది తమ ఇంటా వంటా లేనట్లుగా చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. తెలంగాణ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు పక్కా నిబంధనల ప్రకారమే చేపట్టినవిగా చెబుతుంటారు. అంతేకాదు.. అవన్నీ పాత ప్రాజెక్టులుగా అభివర్ణిస్తారు. రీడిజైన్ చేశామే తప్పించి.. తాము నిబంధనలకు విరుద్ధంగా.. ఉల్లంఘనలకు పాల్పడింది లేదని వాదనలు వినిపిస్తారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంపై తాజాగా జాతీయ హరిత ట్రైబ్యునల్ షాకింగ్ తీర్పును ఇచ్చింది.
సూటిగా చెప్పేయాలంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిబంధనలు ఉల్లంఘించినట్లు చెప్పటమే కాదు.. ముందుస్తు అనుమతులు లేకుండానే నిర్మాణం చేశారని తేల్చింది. పర్యావరణ అనుమతుల్లోనూ అతిక్రమణలు చోటు చేసుకున్నాయని.. పర్యావరణానికి హాని కలిగినట్లు చెప్పారు. తాగునీటి ప్రాజెక్టు అంటూ తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసే వాదనను తాము అంగీకరించమంటూ తీర్పును ఇచ్చేసింది. జరిగిన దానికి తామేమీ చేయలేమంటూనే.. పునరుద్ధరణ.. ఉపశమన చర్యలు చేపట్టాలని పేర్కొంది. మూడో టీఎంసీ విస్తరణ పనుల్లో కేంద్రం ఆదేశాల్ని పాటించాలని తేల్చింది.
రోజుకు రెండు టీఎంసీలకు బదులుగా మూడుటీఎంసీల నీటిని తోడుకోవటానికి చేపడుతన్న విస్తరణలో ఎలాంటి మౌలిక మార్పులు లేవని.. అందుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న తెలంగాణ రాష్ట్ర వాదన సరికాదని తేల్చింది. ఎక్కువ నీళ్లు తోడుతున్నప్పుడు సహజంగానే నిల్వ సామర్థ్యం అవసరం అవుతుందని.. అది గోదావరి నది మీదా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అక్రమాలు జరిగినట్లు గుర్తించినా.. జరిగిన దానిని వెనక్కి తిప్పటం సాధ్యం కాదని.. తాము అలా చేయాలని అనుకోవటం లేదని పేర్కొంది.
జవాబుదారీతనాన్ని ఖరారు చేయటం.. తగిన పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలన్న ట్రైబ్యునల్.. చట్టాన్ని ఉల్లంఘించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా జవాబుదారీ చేయాలన్నఅంశాల్ని పరిశీలిస్తున్నట్లు చెప్పింది. 2008లో ప్రాజెక్టు నిర్మాణం మొదలైందని.. పర్యావరణ అనుమతులు పొందటానికి ముందే అధిక భాగం నిర్మాణం జరిగినట్లుగా ధర్మాసనం గుర్తు చేసింది. తాగునీటి సరఫరా కోసమే ప్రాజెక్టు చేపట్టినట్లుగా ప్రభుత్వం ఆధారాల్ని చూపించలేదని పేర్కొంది. ముందస్తు అనుమతులు లేకుండా అటవీ భూములు మళ్లించటంతో పాటు.. సాగునీటి ప్రాజెక్టు కోసం అక్రమనిర్మాణాలు చేపడుతున్నారంటూ తమతో పాటు హైకోర్టు కూడా గుర్తించినట్లుగా తెలిపింది. మరి.. ఈ తీర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమని బదులిస్తారో చూడాలి.