తెలుగు వారి సంప్రదాయ పండుగల్లో ప్రధానమైన సంక్రాంతికి ముందు రోజు(నేడు) నిర్వహించుకునే భోగి పండుగ సందర్భంగా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనూహ్యమైన పిలుపునిచ్చింది. ఈ భోగిని.. కీడు తొలగాలి-ఏపీ వెలగాలి నినాదంతో నిర్వహించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు సంబంధించిన జీవోలను, అదేవిధంగా ప్రతిపక్షాలు, ఒక వర్గం ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశించి తెచ్చిన చీకటి జీవోలను భోగి మంటల్లో కాల్చి దహనం చేసి నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కీడు తొలగాలి-ఏపీ వెలగాలి కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆదివారం భోగిని పురస్కరించుకుని రాజధాని అమరావతి గ్రామాల్లో నిర్వహించిన తొలి కార్యక్రమంలో చంద్రబాబు.. జనసేన అదినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి పాల్గొని ప్రభుత్వ చీకటి జీవోలుగా చెబుతున్న వాటిని తగుల బెట్టారు. అనంతరం.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, శ్రేణులు.. నాలుగు రోడ్ల కూడళ్లలో భోగి మంటలు వేసి.. ఈ ప్రతులు వేసి దహనం చేశారు.
చీకటి జీవోలతో పాటు.. వైసీపీ 2019 ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో జిరాక్స్ ప్రతులను కూడా తగుల బెట్టారు. ఉమ్మడి కృష్నా జిల్లాలోని పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి.. ఈ ప్రతులను తగల బెట్టారు. అదేవిధంగా తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అమలాపురం, విజయనగరం, ఇటు అనంతపురం, తిరుపతి, కర్నూలు జిల్లాల్లోనూ టీడీపీ నాయకులు కీడు తొలగాలి-ఏపీ వెలగాలి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు