ఏంటి.. ఆశ్చర్య పోతున్నారా? ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అసలు ఎవరీ వైఎస్ అనిల్‌రెడ్డి.. అని తర్కించుకుంటున్నారా? దీనిలో ఆశ్చర్యమేమీ లేదని అంటున్నారు కడప జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు. ప్రస్తుతం ఈ విషయమే రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు.. సీఎం జగన్ వైఖరితో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు మారతాయోనని ప్రతి ఒక్కరూ సందేహిస్తున్నారు. నేరుగా న్యాయ వ్యవస్థను ఢీకొట్టడం దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోనని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదొక భాగమైతే.. మరోపక్క, సీఎం జగన్ సొంత బాబాయి.. వివేకానందరెడ్డి హత్య కేసు వేగం పుంజుకుంది. గత ఏడాది ఎన్నికల సమయంలో ఇంట్లోనే హత్యకు గురైన ఈ కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించిం ది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీబీఐ.. విచారణ ప్రారంభించింది. అయితే, నిన్నమొన్నటి వరకు నత్తనడకన సాగిందనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే, ఇటీవల కాలంలో సీబీఐ ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. మరీ ముఖ్యంగా ఎఫ్ ఐఆర్ నమోదు చేయడం దాదాపు 1300 మంది సాక్షులను విచారించాలని నిర్ణయించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అనుమానితులుగా ఉన్న ముగ్గురికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు నార్కో పరీక్ష కూడా నిర్వహించారు. ఈ కేసులో చిత్రం ఏంటంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్.. ఈ కేసుపై సీబీఐని వేయాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లారు. అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకున్నారు. అదేసమయంలో వివేకా సతీమణి భాగ్యమ్మ, కుమార్తె సునీతలు సీబీఐ విచారణ కోరుతూ.. కోర్టుకు వెళ్లడం. అదేవిధంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న కొందరు ప్రతిపక్ష నేతలు.. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి కూడా సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ.. కడప జైల్లో ఉన్న కొందరు అనుమానితులను పరీక్షించింది.
తాజాగా కీలక నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.ముఖ్యంగా పులివెందులలో చెప్పుల దుకాణం నిర్వహించే మున్నాను కూడా సీబీఐ విచారించింది. ఆయన బ్యాంకు అకౌంట్లో భారీ ఎత్తున నగదు, బంగారం ఉన్నట్టు భావిస్తున్నారు. మున్నాకు ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎలా వచ్చిందనే విషయంపై సీబీఐ దృష్టి పెట్టింది. గతంలో ఈయన వివేకాకు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. తాజాగా సీబీఐ రెండో ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేసింది. దీనిని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు చూస్తున్నారని తెలిసింది.
అయితే, తాజాగా నమోదు చేసిన ఎఫ్ ఐఆర్‌లో ఈ కేసులో ఆది నుంచి బలంగా విమర్శలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరును కూడా చేర్చారని తెలిసింది. ఈ పరిణామాలతో ఆయన ఏ క్షణంలో అయినా అరెస్టయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే.. కడప పార్లమెంటు నుంచి వైఎస్ జగన్‌కు ఆప్తుడు, ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణ వెనుక షాడో నాయకుడిగా అన్నీ చక్కబెడుతున్న వైఎస్ అనిల్‌ను నిలబెట్టి గెలిపిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జగన్ విషయంలోనూ అవినీతి కేసులపై విచారణ జరుగుతోంది. ఇవి ఆరు మాసాల్లో తేలిపోయే అవకాశం ఉంది.
వీటన్నింటికీ తోడు న్యాయవ్యవస్థపై జగన్ చేసిన ఆరోపణలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదుల నేపథ్యంలోఆయన కూడా ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా.. పదవి నుంచి తప్పుకోవడంతోపా టు.. జైలుకు వెళ్లినా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే.. ప్రభుత్వ పాలనను తన సతీమణి భారతికి అప్పగించడం ఖాయమని అంటున్నారు. ఇక, పైన పర్యవేక్షణ బాధ్యతలను కడప ఎంపీగా ఉండే.. వైఎస్ అనిల్‌కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. అంతేకాదు, సీఎం జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న అనిల్‌కు జగన్ వ్యాపారాలు, ఆఫ్రికా తదితర దేశాల్లో ఉన్న గనులను కూడా అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైఎస్ అనిల్.. చెన్నైలో మేనేజ్మెంట్ విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆయన సీఎం జగన్ ప్రభుత్వంలో తెరచాటున ఉండి.. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, ఎర్రచందనం మాఫియా, మైనింగ్ మాఫియాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అంతేకాదు, సీఎం జగన్‌కు కర్త కర్త క్రియ.. అన్నీ అనిల్ కుమార్ రెడ్డేనని అంటున్నారు. జగన్‌తో కలిసి కర్ణాటక, హైదరాబాద్, చెన్నైలలో అవినీతి, నేరాలకు కూడా పాల్పడ్డారని అంటున్నారు. వైఎస్ అనిల్ ఇప్పటికే ఐవీ లీగ్ ఆఫ్ చర్చ్ మిషన్ ద్వారా విదేశాల్లోనూ తన నెట్ వర్క్‌ను డెవలప్ చేసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఏదైనా పరిస్థితి తిరగబడి సీఎం సీటు నుంచి తప్పుకొంటే.. భారతికి ఈ పదవిని అప్పగించి.. పర్యవేక్షణ బాధ్యతలను కడప ఎంపీగా ఉండే వైఎస్ అనిల్ కుమార్‌రెడ్డికి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో.. పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.