తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు ఆయన పార్టీ వారిని, విపక్షాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడాదిగా శ్వాసించిన పగను దిగమింగి ఒక్కసారిగా ఆయన ప్రేమ బాణాలు రువ్వారు. ఒకప్పటి తన మిత్రుడు, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై వలపు వల విసిరారు. అసెంబ్లీ సాక్షిగా ప్రేమ పొంగిపొర్లింది. అయితే… ఈటెల మాత్రం కేసీఆర్‌ది వన్ సైడ్ లవ్ అని, తాను ఆయన ప్రేమలో పడే ప్రసక్తే లేదంటున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి చివరి రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఈ సమావేశాలలో సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌పై తెగ ప్రశంసలు కురిపించారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్య ఇస్తున్నామంటే దానికి కారణం ఈటల రాజేందరేనని కేసీఆర్ అన్నారు.. ఇప్పుడు కట్టిస్తున్న సంక్షేమ భవనాల కాన్సెప్ట్ కూడా ఈటలదేనని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈటెల వేరే పార్టీలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో సమస్యలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సూచనలు తీసుకుంటామని అన్నారు.
ఈటల ఇప్పుడు వేరే పార్టీకి చెందిన నేత కాబట్టి ఆయన సలహాలు తీసుకోం అనుకోవద్దని, అవసరమైతే ఆయనకు ఫోన్ చేసి మరీ సలహాలు తీసుకోవాలని తన మంత్రులకు, సొంత పార్టీ నేతలకు కేసీఆర్ సూచించడం రాష్ట్రం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. కేసీఆర్‌కు ఇంతగా ప్రేమ పొంగుకు రావడానికి కారణమేంటన్న దానిపై రకరకాల ఊహాగానాలు మొదలైపోయాయి. ఈటలను మళ్లీ బీఆర్ఎస్లోకి తెచ్చేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నారని.. ఈటల కూడా ఏ క్షణాన్నైనా బీఆర్ఎస్లోకి చేరొచ్చన్న ఊహాగానాలూ మొదలయ్యాయి.
మరి… జాతీయ పార్టీతో మోదీని ఢీకొట్టడానికి రెడీ అంటున్న కేసీఆర్ ఇప్పుడు మోదీ పార్టీలోని తన పాత అనుచరుడిపై కురిపిస్తున్న ఈ ప్రేమ వెనుక కారణమేంటన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. సొంత పార్టీ నేతలు మాత్రం కేసీఆర్ రూట్లోనే తామూ అంటూ ఈటలపై ప్రత్యేక అభిమానం చూపుతున్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తథ్యం అనుకుంటున్న తరుణంలో కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది… ఈటల పాత గూటికి వస్తారా… బీజేపీ ఆశలన్నీ బూడిదపాలు చేస్తారా అన్నది చూడాలి. మొత్తానికి కేసీఆర్ వాలంటైన్ పాలిటిక్స్ ముందుముందు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి.