గతంలో ఎప్పుడూ లేనట్లుగా రాబోయే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేయాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. రెగ్యులర్ గా పోటీచేస్తున్న గజ్వేలు నియోజకవర్గంలోనే కాకుండా కొత్తగా కామారెడ్డి నియోజకవర్గంలో కూడా పోటీచేయబోతున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఇపుడు కామారెడ్డి ఎంఎల్ఏ గంప గోవర్ధన్ తో పాటు మంత్రి కూడా అడిగారని అందుకనే అంగీకరించినట్లు కేసీయార్ అంటున్నారు. అయితే కామారెడ్డిలో కేసీయార్ పోటీచేయటం వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు.
ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే రెండు నియోజకవర్గాల్లో కేసీయార్ గెలిచిన తర్వాత కామారెడ్డిలో రాజీనామా చేస్తారట. కామారెడ్డికి రాజీనామా చేసిన ఆ స్ధానంలో కూతురు కల్వకుంట్ల కవిత పోటీచేస్తుందని అంటున్నారు. అంటే కవిత కోసమే రెండోసీటును ఎంచుకుని, గెలిచి మళ్ళీ రాజీనామా చేసేది అచ్చంగా కూతురు కోసమే అని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అంటే కూతురు గెలుపుకోసం కేసీయార్ సేఫ్ నియోజకవర్గాన్ని రెడీ చేస్తున్నారని అర్ధమవుతోంది.
కేసీయార్ కూతురనే కానీ కవిత మీద జనాల్లో విపరీతమైన వ్యతిరేకతుంది. ఈ వ్యతిరేకత కారణంగానే నిజామాబాద్ ఎంపీగా రెండోసారి పోటీచేసినపుడు ఓడిపోయారు. కేసీయార్ కూతురి హోదాలో ఎక్కడ పోటీచేసినా గెలుస్తాననే నమ్మకం కవితలో ఉండచ్చు. అయితే కేసీయార్ కూతురు అన్న అర్హత ఒక్కడే సరిపోదని నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత అర్ధమయ్యుంటుంది. ఎవరైనా సరే గెలిచినా, ఓడినా జనాల్లో ఉంటు, జనం కోసం పనిచేసే వారినే జనాలు నమ్ముతారన్న విషయాన్ని కవిత మరచిపోయారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కవిత నిజామాబాద్ ఎంపీగానే పోటీచేయాలని అనుకుంటున్నారు. అయితే గెలుపు అంత సులభంకాదు. రెండోసారి కూడా ఓడిపోతే పోయేది కేసీయార్ పరువే కానీ కవితది కాదు. కేసీయార్ కూతురు అనే అర్హత తప్ప కవితకు ఇంకేమీ అర్హతలేదు. అందుకనే సేఫ్ నియోజకవర్గంగా కామారెడ్డిని కేసీయార్ రెడీచేస్తున్నట్లు పార్టీలోనే టాక్ విస్తృతంగా వినబడుతోంది. తాను గెలిచిన నియోజకవర్గం ఉపఎన్నికలో కూతురు పోటీచేసి ఓడిపోవటం అన్నది ఉండదు అన్న నమ్మకం కేసీయార్లో బలంగా ఉన్నట్లుంది. అందుకనే రెండు నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నారట. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.