చాలా రోజుల నుంచి కేసీఆర్ జాతీయ పార్టీపై ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. విజయదశమినాడు కేసీఆర్ కొత్త పార్టీ పేరు ప్రకటించబోతుండడంతో ఆ పార్టీ పేరు ఏమై ఉంటుందా అన్న ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది. అయితే, ఆ పార్టీ పేరు బీఆర్ఎస్ అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ ప్రచారానికి తగ్గట్లుగానే, అందరూ ఊహించినట్లుగానే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీగా ఆవిర్భవించింది.
తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ప్రవేశ పెట్టిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ అని, ఇకపై ఇది జాతీయ పార్టీ అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ తీర్మానానికి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు మొత్తం 283 మంది సభ్యులు ఆమోదం తెలిపి సంతకాలు పెట్టారు. ముందుగా ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగానే మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ జెండా ఎప్పటిలాగే గులాబీ రంగులో ఉండబోతోంది. ఇక, పార్టీకి ఐకాన్ గా ఉన్న కారు గుర్తు కూడా కొనసాగేలా కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ లేఖ రాయనుంది. హిందీ మాట్లాడే నార్త్ ఇండియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకొని భారత్ రాష్ట్ర సమితి అనే పేరును నిర్ణయించారు. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా నమోదై ఉన్న నేపథ్యంలో ఈ పేరు మార్పు తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
బీఆర్ఎస్ లో భారీగా సభ్యత్వ నమోదు జరపాలని,కర్ణాటక సహా పొరుగు రాష్ట్రాల మద్దతుందని కేసీఆర్ తన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. జాతీయ స్థాయిలో అవకాశాలు పార్టీ నేతలను వరిస్తాయని,పార్టీ ఇన్చార్జులుగా, గవర్నర్లుగా పనిచేయవచ్చని చెప్పారు.