తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి డిసైడ్ అయ్యాక.. మార్పులుచేర్పులకు అవకాశం ఉండదు. ఆ మాటకు వస్తే.. ఎదుటోళ్లు మారాలే తప్పించి.. ఆయనకు ఆయన మారేందుకు సుతారం ఇష్టపడరు. ఎందుకంటే.. డిసైడ్ కావటానికి ముందే పక్కాగా కసరత్తు జరుగుతుంటుంది కాబట్టి. అలాంటి కేసీఆర్.. తాజాగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించేందుకు ఈ రోజు(ఫిబ్రవరి 14, మంగళవారం) వెళ్లాలని డిసైడ్ చేయటం తెలిసిందే.
అయితే.. అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఫిబ్రవరి 14 కాదు 15న వెళ్లాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఒక రోజులో వచ్చే మార్పేంటి? అన్న ప్రశ్నకు టీఆర్ఎస్ వర్గాల నుంచి సరైన సమాధానం లేదు. పర్యటన వాయిదా పడింది ఎందుకు? అన్న ప్రశ్నకు వస్తున్న సమాధానం.. మంగళవారం స్వామిని దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అలాంటి వేళలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన అంటే.. కనీసం ఐదారు గంటలు ఉంటుంది కాబట్టి.. ఆ టైంలో భక్తులు ఇబ్బంది పడకూడదని చెబుతున్నారు.
ఒకవేళ నిజంగానే ఇదే కారణం అనుకుంటే.. షెడ్యూల్ డిసైడ్ చేసే ముందు మంగళవారం ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్న విషయాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఉండరు కదా? కేవలం భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ముఖ్యమంత్రి తన పర్యటనను రీషెడ్యూల్ చేసుకున్నారన్నది నిజమే అయితే..ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు విచ్చేసిన ఢిల్లీ.. హర్యానా ముఖ్యమంత్రుల్నివెంట పెట్టుకొని యాదాద్రికి వెళ్లటం.. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి కావటం తెలిసిందే.
నిజంగానే భక్తుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తన పర్యటనను వాయిదా వేసుకుంటే.. ఆదివారం యాదాద్రికి పెద్దఎత్తున భక్తులు వెళ్లే నేపథ్యంలో.. ఆయన తన ప్రోగ్రాంనను రీషెడ్యూల్ చేసుకునే వారు కదా? భక్తుల గురించి అప్పుడు లేని ఆలోచన అంతా కొండగట్టుకు వచ్చే భక్తుల గురించి ఆలోచించటం లాంటివి ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటోళ్లు చేస్తారా? అన్నది ప్రశ్న. ఇదంతా చూసినప్పుడు.. కొండగట్టుకు సీఎం కేసీఆర్ షెడ్యూల్ మారటానికి దీనికి మించిన ముఖ్యమైన పని మరేదో ఉందన్న మాట వినిపిస్తోంది. అదేమిటన్నది త్వరలోబయటకు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.