ఉద్యోగాల భర్తీలో కేసీయార్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందనే చెప్పాలి. ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతోంది. పరీక్ష నిర్వహిస్తే వెంటనే ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల్లో కాపీయింగ్ ఆరోపణలు, పరీక్షల రద్దు, లీకేజీ వీరుల అరెస్టులు, విచారణలతో ప్రభుత్వం గబ్బుపట్టిపోయింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేసి మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం పరువంతా పోయింది. తనను తాను సమర్ధించుకునేందుకు కేసీయార్, మంత్రులు ఎన్ని మాటలైనా చెబుతారు. కానీ నిరుద్యోగులు, మామూలు జనాల మాటల్లో అయితే ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్.
గడచిన ఏడాదిన్నరలో వేలాది పోస్టుల భర్తీకి పదులసంఖ్యలో ఇచ్చిన నోటిఫికేషన్లలో చాలావరకు వివాదాస్పదమయ్యాయి. దీనివల్ల ఏమైందంటే నిరుద్యోగులకు టీఎస్పీపీఎస్పీ బోర్డుతో పాటు ప్రభుత్వం మీదకూడా నమ్మకం పోయింది. ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించి ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ప్రకటించలేదు. నిర్వహించిన ప్రతి పరీక్ష ఏదో దశలో వివాదాస్పదమవటం, కోర్టులో కేసులు పడటం లేదా రద్దవ్వటం.
వేలాది రూపాయలను ఖర్చులు పెట్టుకుని నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో చేరి పరీక్షలకు ప్రిపేర్ అయితే రాసిన పరీక్షలు రద్దవుతుంటే మండిపోతున్నారు. టీఎస్సీపీఎస్సీ బోర్డు ముందు రెగ్యులర్ గా ఆందోళనలు చేస్తునే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగుల నుండి బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పేట్లు లేదనే అనిపిస్తోంది. నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో ఉంది. గత ఏడాది అక్టోబర్లో 503 గ్రూప్-1 పోస్టులకు పరీక్షలు జరిగాయి. దీనికోసం 3.5 లక్షలమంది రాశారు. అయితే పేపర్ లీకేజీ కారణంగా పరీక్షలు రద్దయ్యాయి. దాంతో లక్షలాదిమంది నిరుద్యోగులంతా మండిపోతున్నారు.
పోయిన సంవత్సరం మార్చిలో అసెంబ్లీలో కేసీయార్ మాట్లాడుతు తొందరలోనే వివిధ క్యేటగిరీల ఉద్యోగాలు 80 వేలు భర్తీ చేస్తామని చెప్పారు. ప్రకటన ప్రకారమే టీఎస్పీఎస్సీ 26 రకాల ఉద్యోగాలకు నోటిఫికేఫన్లు జారీచేసింది. వీటిద్వారా 13,144 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతవరకు ఒక్కపోస్టును కూడా భర్తీచేయలేదు. ఎందుకంటే చాలా పరీక్షలు నిర్వహణలో వివాదాస్పదమయ్యాయి. దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధుల విజయంపై పడతాయనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.