సంపన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ .. కాలు బయటపెట్టిన ప్రతిసారీ ప్రత్యేక విమానమే తప్పించి విడిగా ప్రయాణం చేయరన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానం ఎందుకని.. ఈ మధ్యన సొంతంగానే లోహ విహంగాన్ని ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టటం.. ఆ వెంటనే గులాబీ నేతలు బిగ్ బాస్ కోసం భారీ విరాళాన్ని వితరణగా ఇవ్వటం తెలిసిందే. ఆ హెలికాఫ్టర్ ఎప్పటికి వస్తుందో తెలీదు కానీ.. ఆయన ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక విమానాన్ని వాడుతుంటారని తెలిసిందే.
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్లిన వేళ ప్రత్యేక విమానాన్ని వాడటాన్ని అర్థం చేసుకోవచ్చు. తాజా ట్రిప్ కూడా ప్రజల ఖాతాలోకే వస్తుందా? అన్నది సమస్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో సున్నిత అంశాలు.. చిన్నవిగా భావించే వాటి మీద పెద్దగా ఫోకస్ పెట్టటం లేదనుకోండి. అందునా ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి ఖర్చు గురించి ప్రజలకు సైతం పెద్దగా పట్టని పరిస్థితి. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ పనుల కోసం కాదు. తన సొంత పార్టీ పనుల మీదనే వెళ్లటం తెలిసిందే.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన నేపథ్యంలో.. పార్టీ ఢిల్లీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. సోమవారం సాయంత్రం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన ఆయన వెంట భార్య, మనమడు ఉండటం గమనార్హం. వీరితో పాటు మరికొందరు ఉన్నారనుకోండి. మరి.. పార్టీ పని మీద ఢిల్లీకి వెళ్లినప్పుడు.. అందునా ప్రత్యేక విమానంలో అయినప్పుడు ఆ ఖర్చు ఎవరి ఖాతా? అన్నది కీలకం. కానీ.. ఇప్పుడున్న పరిస్థతుల్లో అలాంటవాటిని అటు ప్రజలు.. ఇటు ప్రభుత్వంతో పాటు ప్రశ్నించే మీడియా సైతం పట్టించుకోవటం మానేసి చాలాకాలమే అయ్యింది.
ఇదంతా చూసినప్పుడు పార్టీ పని కోసం ఢిల్లీకి వెళుతున్నప్పుడు.. సొంతంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మరి.. కేసీఆర్ అలానే చేశారా? లేదా? అనే విషయాన్ని కొందరు ముఖ్యనేతలతో మాట్లాడినప్పుడు వారు ఒక నవ్వు నవ్వి.. ‘ఇవాల్టి రోజుల్లో కూడా ఇంత సెన్సిటివ్ గా ఆలోచించేటోళ్లు ఉంటారన్నా’ అంటూ బదులివ్వటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో పావలా లెక్క తేడా వచ్చిందని మంత్రి పదవికి రాజీనామా చేసిన ఘన చరిత్ర మనోళ్లది. ఆ రోజుల నుంచి.. సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్లటానికి ప్రత్యేక విమానాన్ని ప్రజల ఖాతాలో ఏర్పాటు చేసుకోవటం దేనికి నిదర్శనం. ఎక్కడికి మన ప్రయాణం?