“మేం ఇచ్చినన్ని పథకాలు.. ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. దళిత బంధు, రైతు బంధు అనే పథకాలు సృష్టించిందే మనం. ఇన్నిన్ని పథకాలను తెలంగాణ ప్రజలకు ఇస్తున్నది మన పార్టీనే“- ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ నుంచిఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ వరకు దంచి కొట్టిన ప్రచారం ఇది. కానీ, ఈ పథకాలేవీ.. ఎన్నికల్లో వారిని అదికారంలోకి తీసుకురాలేకపోయాయి. అంతేకాదు.. డబుల్ బెడ్ రూమ్ పథకం ఎటు పొయిందో .. కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
కట్ చేస్తే.. ఈ తరహా పాలనే ఏపీలోనూ సాగుతోంది. లక్షల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో వేస్తున్నా మని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. వారి ఓట్లు తమకే వేయాలని కోరుతోంది. అమ్మ ఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం, చేదోడు ఇలా.. అనేక కార్యక్రమాల పేర్లు వల్లెవేస్తోంది. అయితే.. అహం కారం ముందు.. ఈ పథకాలు పనిచేయలేదనేది తెలంగాణ సమాజం.. స్పష్టం చేసేసింది. ప్రజలకు చేరువ కాకపోవడం.. వారి ఆవేదన వినకపోవడం.. పాలకులు చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించడం.. అక్కడ తెలంగాణ తెచ్చానని చెప్పిన నాయకుడికి షాక్ ఇచ్చేసింది.
ఇక, ఏపీలోనూ ఇదే తరహా పాలన సాగుతోందని ప్రతిపక్షాలు కొన్నాళ్లుగా చెబుతున్నాయి. ప్రజల సమస్య లు వినిపించుకోకపోవడం.. ప్రజల మాటకు విలువ లేకుండా పోవడం.. 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వంటివి.. వైసీపీకి ప్రదాన మైనస్లుగా ఉన్నాయి. ఎంత ఇచ్చామనే కన్నా.. ప్రజలకు ఎంత చేరువ అయ్యామనే విషయాన్ని పరిశీలిస్తే.. వైసీపీ చాలా చాలా వెనుకబడి పోయిందనే టాక్ వస్తోంది.
ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి జీవులు ఇలా ఎవరిని తీసుకున్నా క్షేత్రస్థాయి లో సమస్యలు పరిష్కరించడం లేదనే వాదనే వినిపిస్తోంది. ఎంతసేపూ.. ప్రతిపక్షాలపై కత్తికట్టినట్టు వ్యవహరించడం.. తాను అనుకున్నదే చేయడం వంటివి మెజారిటీ ప్రజలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. ఇదే తరహా పాలన సాగితే.. వచ్చే ఎన్నికలలో తెలంగాణ ఫలితమే ఏపీలోనూ ఎదురు కానుందని పరిశీలకులు చెబుతున్నారు.