ఎన్నికల ప్రచార సభల్లో ఏమి మాట్లాడుతున్నారో కూడా కేసీఆర్ కు అర్ధమవుతున్నట్లు లేదు. ఎందుకంటే ఖమ్మం బహిరంగసభలో మాట్లాడిన తాజా మాటలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఖమ్మంలో మాట్లాడుతు తెలంగాణా ఉద్యమాన్ని, బీజేపీ, కాంగ్రెస్ పాత్రగురించి నోటికొచ్చినట్లు మాట్లాడారు. పై రెండుపార్టీలు తెలంగాణా ఉద్యమంలో పాల్గొనలేదని ఆరోపించారు. నిజానికి కేసీయార్ చెప్పింది పూర్తిగా తప్పు. ఎలాగంటే తెలంగాణా వాదానికి మద్దతుగానే అప్పట్లో తెలంగాణా మంత్రులు, కొందరు ఎంఎల్ఏలు పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.
సరే ఈ విషయాన్ని వదిలేస్తే రాబోయే రోజుల్లో రాజకీయమంతా ప్రాంతీయపార్టీల చేతుల్లోనే ఉంటుందన్నారు. ప్రాంతీయ పార్టీలను కాదని జాతీయ పార్టీలు ఏమీ చేయలేవని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ ను కేసీయారే జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చారు. మరిపుడేమో ఆ విషయం మరచిపోయి జాతీయపార్టీలతో ఏమీ కాదని చెప్పటమంటే బీఆర్ఎస్ వల్ల కూడా ఏమీకాదని అంగీకరించటమే కదా ? అసలు తాను బీఆర్ఎస్ జాతీయపార్టీ అధ్యక్షుడిననే విషయాన్ని కేసీయార్ మరచిపోయినట్లున్నారు.
స్వయంగా తానే జాతీయపార్టీకి అద్యక్షుడయ్యుండి ప్రాంతీయపార్టీలదే భవిష్యత్తని, జాతీయపార్టీలతో ఏమీ కాదని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఈ కామెంట్లతోనే తాను ఏమి మాట్లాడుతున్నారో కేసీయార్ కు అర్ధంకావటంలేదనే సెటైర్లు బాగా పెరిగిపోతున్నాయి. జాతీయ పార్టీల వల్ల ఏమీకాదని స్వయంగా కేసీయారే అంగీకరించారంటే బీఆర్ఎస్ వల్ల కూడా ఏమీకాదని ఒప్పుకున్నట్లే. అలాంటపుడు జనాలు బీజేపీ, కాంగ్రెస్ ను కాదని బీఆర్ఎస్ కు మాత్రమే ఎందుకు ఓట్లేయాలి ?
ఇక్కడ సమస్య ఏమిటంటే ఖమ్మంలోనే కాదు ఇంతకుముందు కూడా నోటికేదొస్తే అది మాట్లాడేస్తున్నారు. మొదటి బహిరంగసభలోనే బీఆర్ఎస్ ఓడిపోతే తనకొచ్చే నష్టమేమీలేదని హాయిగా ఫాం హౌస్ కు వెళ్ళి రెస్టు తీసుకుంటానని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఓడిపోతే అన్న మాట కేసీయార్ నోటివెంట వచ్చిందంటేనే ముఖ్యమంత్రిలో ఓటమిభయం పెరిగిపోతోందన్న విషయం అందరికీ అర్ధమైంది. కాకపోతే మేకపోతు గాంభీర్యం అన్నట్లుగా ప్రతిపక్షాలపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంతే. మరి చివరకు ఏమవుతుందో డిసెంబర్ 3వ తేదీన తేలిపోతుంది.