ఏపీకి, తెలంగాణకు మధ్య కేంద్రం గొడవలు పెట్టాలని చూస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఏపీకి తెలంగాణ 12 వేల కోట్ల రూపాయలు బకాయి ఉందని కేంద్రం ఆరోపిస్తోందని అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మండిపడ్డారు. కానీ, ఏపీ నుంచి తెలంగాణకు దాదాపు 17వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానంటూ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.
కేంద్రం అన్నీ అమ్మేస్తోందని, వ్యవసాయం, విద్యుత్ మాత్రమే మిగిలాయని కేసీఆర్ అన్నారు. సంస్కరణల పేరుతో వీటిని అమ్మేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో పండే పంటను సిద్ధిపేటలోనే అమ్మే పరిస్థితి ఉండదని, కేంద్రం ఎక్కడైనా అమ్ముకోవచ్చని మాయ మాటలు చెబుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు. వేరే రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలు తెలంగాణలో అమలులో ఉన్నాయని, అది బీజేపీకి కండ్ల మంటగా ఉందని ఆరోపించారు.
అందుకే ఏపీకి, తెలంగాణకు గొడవ పెట్టేలా విద్యుత్ బకాయిలు ఇయ్యాలని లెటర్లు పంపుతున్నారని అన్నారు. లేకుంటే ఆర్బీఐ ఫండ్స్ ఆపేస్తమని లిటిగేషన్లు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏపీకి తాము ఇవ్వాల్సిన బకాయిలు మినహాయించుకుని మిగతావి తమకు ఇప్పించేలా కేంద్రం చూడాలని కోరారు. మీటర్ పెట్టకుండా విద్యుత్ కనెన్షన్ ఇవ్వొద్దని కేంద్రం తీసుకువచ్చిన గెజిట్లోనే ఉందని, గెజిట్ నిన్నగాక మొన్న వచ్చిందని, చట్టంలో లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో మీటర్ పెడితే రైతులంతా కుప్పలు పోసి.. ధర్నా చేశారని గుర్తు చేశారు. ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే సర్వనాశనం అవుతుందని అక్కడికి వెళ్లి వాస్తవాలు తెలుసుకున్నామని చెప్పారు. ఏది ఏమైనా…రాజీనామా అంటూ కేసీఆర్ ఛాలెంజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.