జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా
తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రా పాలకుల కారణంగా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతంలో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
గతంలో తెలంగాణ అనే పదం పలకడమే కష్టంగా ఉండేదని, శాసన సభలో స్వయంగా సభాపతి తెలంగాణ పదమే వాడవద్దని ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేసుకున్నారు. భరించలేని అమానుషానికి తెలంగాణ లోనైందని, ఉద్యమంలో ఏనాడూ తన పంథా మార్చుకోని వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
ముల్కీ రూల్స్ కు అనుకూలంగా తీర్పు రావడంతో జై ఆంధ్రా ఉద్యమం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ముల్కీ రూల్స్ అమలు కోసం జరిగిన ఆందోళనలలో 9 మంది చనిపోయారని, జై ఆంధ్రా ఉద్యమంలో 70 మంది వరకు చనిపోయారని, దీంతో ముల్సీ రూల్స్ అమలుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లకుండా నాటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసిందని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు
ఇక, ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం గోల్ మాల్ అని, బీఆర్ఎస్ కు 11 సీట్లు వస్తాయని ఒకడు, ఒక్కటి కూడా రాదని ఇంకొకడు అంటూ ఉంటారని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన పని లేదని, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కచ్చితంగా మెరుగైన ఫలితాలే వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని ఎంపీ స్థానాలు వచ్చినా బాధ లేదని, 11 సీట్లు వస్తే పొంగిపోయేది లేదు, రెండో మూడో వస్తే కుంగిపోయేది లేదు అని కేసీఆర్ తన మార్క్ కామెంట్లతో స్పందించారు.