అవును ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగిందిదే. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో ఒకరకంగా టీఆర్ఎస్ కు పెద్ద షాకే తగిలింది. గ్రేటర్ పరిధిలో అధికారపార్టీ బలం 99 డివిజన్ల నుండి 56 డివిజన్లకు పడిపోయిందన్నది నిష్టుర సత్యం. గెలిచిన 56 డివిజన్లలో కూడా టీఆర్ఎస్ ఎక్కడ గెలిచిందంటే అత్యధిక డివిజన్లు సీమాంధ్రులు బలంగా ఉన్న చోటే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ విచిత్రమేమిటంటే సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న చోట టీఆర్ఎస్ గెలిస్తే పక్కా తెలంగాణా జనాలు అనుకున్న డివిజన్లలో మెజారిటి టీఆర్ఎస్ ఓడిపోయింది.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో తెలంగాణా జనాల్లో ఉద్యమ స్పూర్తిని రగల్చటానికి సీమాంధ్రులపై కేసీయార్, కేటీయార్, హరీష్ రావు అండ్ కో ఎంతగా విషం చిమ్మారో అందరికీ తెలిసిందే. సరే కాలక్రమంలో ప్రత్యేక తెలంగాణా వచ్చిన తర్వాత పరిస్ధితులు చక్కబడ్డాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ సమయంలో కనిపించిన వేర్పాటువాదం తర్వాత మాయమైపోయింది. ఏదో అవసరం వచ్చినపుడు మాత్రమే కేసీయార్ సీమాంధ్రులపై నోటికొచ్చినట్లు మాట్లాడారు.
ఇక తాజా ఫలితాలను గమనిస్తే సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, చందానగర్, నిజాంపేట, మియాపూర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న 37 డివిజన్లలో 32 చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. కారణాలు ఏవైనా కానీండి కేసీయార్ ను సీమాంధ్రులు ఎంతగా ఆదుకున్నారనే విషయంపై ఇపుడు చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో పక్కా తెలంగాణా వాసులున్నారని అనుకునే చాలా ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఘోరంగా ఓడిపోయారు. ఇక్కడ ఎక్కువ డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. ఇక ఓల్డ్ సిటి విషయానికి వస్తే ఇక్కడి డివిజన్లలో ఎంఐఎం తన పట్టు నిలుపుకుంది. అయితే రెండోస్ధానంలో చాలా చోట్ల బీజేపీనే నిలిచింది. ఓల్డ్ సిటిలోని చాలా డివిజన్లలో కూడా పోటీ ఎంఐఎం-బీజేపీ మధ్యే జరిగింది. తమకు ప్రాబల్యముండే ప్రాంతాల్లో ఇంకోపార్టీ తమనే ఛాలెంజ్ చేయటం అన్నది ఎంఐఎంకు షాక్ కొట్టినట్లుగానే భావించాలి. రాజకీయ వాతావరణం ఇలాగే ఉంటే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఓల్డ్ సిటిలో బీజేపీ పాగా వేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మొత్తానికి ఇంతకాలం విషం చిమ్మిన సీమాంధ్రులే కేసీయార్ ను ఆదుకోవటం మాత్రం ఆశ్చర్యమే.