తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వే రిపోర్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేతికి వచ్చిందట? ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న అంశంపై కేసీఆర్ సర్వే చేయించారని.. అందులో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని తేలినట్లు బండి వెల్లడించారు.
సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలో బీఆర్ఎస్ కు 30 స్థానాలకు మించి రావని తేలిపోయినట్లుగా చెప్పిన బండి సంజయ్.. కాంగ్రెస్ పార్టీ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్.. బీఆర్ఎస్ లు కలిసి పోటీ చేస్తున్నట్లుగా సీనియర్ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే చెప్పారని బండి అన్నారు. గుంట నక్కలే గుంపులుగా వస్తాయని.. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుందన్న బండి.. కేసీఆర్ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
దశాబ్ది ఉత్సవాలు ఘనంగా చేస్తున్నట్లు చెబుతున్న సీఎం కేసీఆర్ కు దమ్ముంటే పదేళ్ల తమ పదవీ కాలంలో జరిగిన డెవలప్ మెంట్ కు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సవాల్ విసిరారు. మహిళా దుస్తులపై రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ స్పందించిన తీరును తప్పు పట్టిన బండి సంజయ్.. ఆయన మాటలపై మండిపడ్డారు.