కేసీఆర్ కొత్త రూరల్ ప్లాన్ రచించారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఈరోజు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అభివృద్ధి, అంశాల వారీగా కేసీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్ లో సమీక్ష చేశారు.
పల్లెలు, పట్టణాలను అభివృద్ధి బాట పట్టించాలని, కొత్త రూపు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులు గ్రామాలు, పట్టణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని అన్నారు.
పల్లెలు, పట్టణాలు 100 శాతం ప్రగతి పథంలో పయనించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారిలో సామాజిక బాధ్యత పెంచుతూ అధికారులు ప్రభుత్వం తరఫున అలక్ష్యం లేకుండా పనిచేయాలన్నారు.
తాను ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యాచరణలో ప్రత్యక్షంగా పాల్గొంటానని కేసీఆర్ ప్రకటించారు. స్థానిక సంస్థల సమస్యల పరిష్కరించే క్రమంలో తక్షణమే కొన్ని నిధులను కేటాయించడానికి జిల్లా అదనపు కలెక్టర్లకు రూ.25 లక్షల వరకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని కేసీఆర్ ఆదేశించారు. కొన్ని గంటల్లోనే ఆ జీవో కూడా రెడీ కావడం గమనార్హం.
కరోనా అనంతర పరిణామాల్లో రియల్ రంగం, రిటైల్ రంగం చిన్న పట్టణాలు, గ్రామాల్లో బాగా వృద్ధి చెందే అవకాశం ఉందన్న అవగాహనోతనే కేసీఆర్ ఈ కోణంలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది.